జాతీయ వార్తలు

హార్దిక్ పటేల్ ‘చెంప చెళ్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఏప్రిల్ 19: కాంగ్రెస్ పార్టీ నాయకుడు హార్దిక్ పటేల్‌ను శుక్రవారం ఓ వ్యక్తి చెంపపై కొట్టాడు. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో గల ఒక గ్రామంలో ఒక ఎన్నికల సభలో పటేల్ మాట్లాడుతుండగా అతడిని కొట్టినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీయే తనపై దాడి చేయించిందని, తనను హతమార్చడానికే ఈ దాడి చేశారని హార్దిక్ పటేల్ ఆరోపించారు. అయితే, ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికార పార్టీ నాయకులు తోసిపుచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల సానుభూతిని పొందడానికి కాంగ్రెస్ పార్టీ ఆడిన నాటకంలో భాగమే ఈ సంఘటన అని బీజేపీ నాయకులు ప్రత్యారోపణ చేశారు. హార్దిక్ పటేల్‌ను చెంపపై కొట్టిన వ్యక్తిని మెహ్‌సానా జిల్లా కాడి పట్టణానికి చెందిన తరుణ్ గజ్జార్‌గా గుర్తించారు. పటేల్‌ను చెంపపై కొట్టినందుకు వెంటనే వేదిక వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పటేల్ మద్దతుదారులు, ఇతరులు తరుణ్‌ను చితకబాదారు. దీంతో గాయపడిన అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ర్యాలీలో ప్రజలు తీవ్రంగా కొట్టడం వల్ల గాయపడిన తరుణ్‌కు చికిత్స అందిస్తున్నట్టు వాధ్వాన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఆర్ జేతి తెలిపారు. ఇదిలా ఉండగా, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని, వ్యక్తిగత కారణాల వల్లనే హార్దిక్ పటేల్‌ను కొట్టానని తరుణ్ గజ్జార్ తెలిపారు. ర్యాలీని చిత్రీకరిస్తున్న న్యూస్ చానెళ్ల కెమెరాలలో ఈ సంఘటన చిక్కింది. ఈ సంఘటన జరిగినప్పుడు సురేంద్రనగర్ లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సోమా పటేల్ వేదికపై ఉన్నారు. తరుణ్ గజ్జార్ చాలా కోపంగా కనిపించాడు. పటేల్‌ను చెంపపై కొట్టిన తరువాత తరుణ్ అతనికి ఏదో చెబుతుండటం కనిపించింది.
ర్యాలీ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, పటేల్ మద్దతుదారులు, ఇతరులు తరుణ్‌ను చితకబాదుతుండగా, పోలీసులు అడ్డుకొని అతడిని తమ వాహనంలో సురక్షిత ప్రాంతానికి తీసికెళ్లారని జేతి తెలిపారు. ఈ సంఘటన తరువాత హార్దిక్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరుణ్ గజ్జార్ ఎవరో తనకు తెలియదని అందులో పేర్కొన్నారు. హార్దిక్ పటేల్ నుంచి రాతపూర్వక ఫిర్యాదు తీసుకొని తమ దర్యాప్తు ప్రారంభించామని, ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని జేతి తెలిపారు. కాగా, పటేల్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీయే తనపై దాడి చేయించడానికి గజ్జార్‌ను పంపించిందని ఆరోపించారు. బీజేపీ తనకు హాని తలపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.