జాతీయ వార్తలు

నేడే ఆఖరి విడత.. ఎవరి దశ మారేనో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 18: పదిహేడవ లోక్‌సభ ఎన్నికల ఆఖరు ఏడవ దశ పోలింగ్ ఆదివారం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి రెండోసారి ఎన్నికల బరిలో ఉన్న ఏడవ దశ పోలింగ్‌లో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 59 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. 59 స్థానాల కోసం మొత్తం 918 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆదివారంనాటి పోలింగ్‌తో ఏడు దశల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకు తెర పడుతుంది. నాలుగు రోజుల తరువాత అంటే ఈ నెల 23వ తేదీ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎన్‌డీఏకు మెజారిటీ లభించి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి పదవి చేపడతారా లేక కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? ప్రధాన మంత్రి పదవి కోసం ప్రతిపక్షాల్లో కీచులాట ప్రారంభం అవుతుందా అనేది అప్పటివరకు వేచి చూడాల్సింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం రెండు, మూడు రోజుల్లో ప్రధాన మంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం, జూన్ మొదటి వారంలో కొత్త పార్లమెంటు ఏర్పాటు జరిగిపోతుంది. ఆఖరు దశలో బిహార్‌లో ఎనిమిది, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు, జార్కండ్‌లో మూడు, మధ్యప్రదేశ్‌లో ఎనిమిది, పంజాబ్‌లో మొత్తం పదమూడు, ఉత్తరప్రదేశ్‌లో పదమూడు, పశ్చిమ బెంగాల్‌లో తొమ్మిది, చండీగఢ్‌లో ఒక నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో వచ్చిన దానికంటే అధిక మెజారిటీతో ఈసారి గెలుస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ పోటీ చేయటం తెలిసిందే. అయితే ఈసారి ప్రముఖ వ్యక్తులెవ్వరు నరేంద్ర మోదీపై పోటీ చేయటం లేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీకి దిగుతారని మొదట ప్రచారం జరిగినా ఆఖరున ఆమె ఎన్నికల బరిలోకి దిగేందుకు విముఖత చూపించారు. దానితో నరేంద్ర మోదీకి పోటీ అనేదే లేకుండాపోయింది. కాంగ్రెస్ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయిన అజయ్ రాయ్ ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున శాలినీ యాదవ్ రంగంలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం ఇరవై ఆరు మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే నరేంద్ర మోదీ ఈసారి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని అంటున్నారు. ఏడో దశ పోలింగ్‌లో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, బీజేపీ నాయకులు కిరణ్‌ఖేర్, సినీ నటుడు సన్నీ డియోల్, రవి కిషన్, కాంగ్రెస్ నాయకులు శత్రుఘ్నసిన్హా, మనీష్ తివారీ శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ ప్రేమ్‌సింగ్ చందుమాజ్రా, సుఖ్‌బీర్ బాదల్, జేఎంఎం నాయకుడు శిబూ సోరెన్ తదితరులు తమ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్‌సింగ్ పురి భవితవ్యం ఈ పోలింగ్‌లో ఖరారవుతుంది. మొదటి దశ పోలింగ్ నుండి శాంతిభద్రతలు దెబ్బతింటున్న పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. పోలింగ్ కేంద్రాల్లో గొడవలు.. ముఖ్యంగా బూత్‌లను స్వాధీనం చేసుకోవటం వంటి సంఘటనలు జరుగకుండా చూసేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీ మెజారిటీతో గెలిపించండి
పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని నరేంద్ర మోదీ వారణాసి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ మేరకు వారణాసి ప్రజల పేరిట ఒక లేఖను విడుదల చేశారు. వారణాసిలో తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాల గురించి ఈ లేఖలో వివరించారు. గృహ నిర్మాణం, రోడ్ల విస్తరణ, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ తదితర కార్యక్రమాల గురించి లేఖలో ప్రజలకు వివరించారు. ఎన్నికల రోజు తాను వ్యక్తిగతంగా వారణాసిలో ఉండటం లేదని.. రోడ్ షో సందర్భంగా మీరిచ్చిన మద్దతు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తుందనే ఆశాభావంతో ఉన్నానని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

చిత్రం...పాట్నాలో ఆదివారం జరగనున్న పోలింగ్ కోసం ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలిస్తున్న ఎన్నికల సిబ్బంది