జాతీయ వార్తలు

రేపే జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 6: మరో భారీ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఈనెల 8న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో ముహూర్తం ఖరారు చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) సోమవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్‌తో పాటు పలువురు శాస్తవ్రేత్తలు విచ్చేసి సుదీర్ఘంగా చర్చించి ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి జరిగే ఈ రాకెట్ ద్వారా 2211 కిలోల బరువుగల ఇన్‌శాట్-3 డిఆర్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.
బుధవారం ఉదయం 11:10 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ నిరాటంకంగా కొనసాగిన అనంతరం గురువారం సాయంత్రం 4:10 గంటలకు రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు ఇప్పటికే తుది దశ పరీక్షలు పూర్తయ్యాయి. వాతావరణ అధ్యయనానికి ఈ ఉపగ్రహాన్ని జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం కూడా పూర్తి స్వదేశీ క్రయోజనిక్‌తో చేపడుతున్నారు. ఇప్పటివరకు రెండు ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. స్వదేశీ క్రయోజనిక్‌తో ఇది మూడో ప్రయోగం కావడం విశేషం. 2013లో ఫ్రెంచిగయాన నుండి ఏరియన్ రాకెట్ ద్వారా ఇన్‌శాట్-3డిని ఉపగ్రహాన్ని పంపించారు. అది కక్ష్యలోకి చేరాక సాంకేతిక లోపం తలెత్తడంతో దాని స్థానంలో ఇన్‌శాట్-3 డిఆర్ ఉపగ్రహాన్ని ఇస్రో పంపేందుకు తుదినిర్ణయం తీసుకుంది. ఇది విజయవంతమైతే 10 సంవత్సరాలపాటు దాని సేవలు అందించనుంది.
30న పిఎస్‌ఎల్‌వి ప్రయోగం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నెలలో రెండు ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈనెల 30న పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగం జరగనుంది.
దీనికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం కూడా సోమవారం వేరువేరుగా నిర్వహించారు.మొదటి ప్రయోగ వేదిక నుండి నిర్వహించే ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన స్క్యాట్‌శాట్ ఉపగ్రహం, విద్యార్థులు రూపొందించిన రెండు చిన్న ఉపగ్రహాలతో పాటు నాలుగు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాకెట్ రెండు దశల అనుసంధాన పనులు పూర్తయ్యాయి. అన్ని ఉపగ్రహాలు షార్‌కు చేరుకోవడంతో శాస్తవ్రేత్తలు ప్రయోగ ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు.

చిత్రాలు.. ప్రయోగ వేదిక వద్ద సిద్ధంగా ఉన్న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్