జాతీయ వార్తలు

మాతృభాషలో బోధన అత్యవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 13: మాతృ భాషను ప్రాథమిక బోధనా భాషగా పాఠశాలల్లో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. కనీసం మాతృ భాషను ప్రాథమిక దశలోనైనా అమలు చేయడం వల్ల దాని పట్ల విద్యార్థుల్లో అవగాహన పెరగుతుందని ఆయన అన్నారు. భాషలు అనేవి ప్రజలను అన్ని అంశాల్లో సమీకృతం చేసే విధంగా ఉండాలని సుస్థిర అభివృద్ధికి దోహదం చేసేవి కావాలని ఆయన అన్నారు. అంతేగానీ ఈ భాషల వల్ల ప్రజల మధ్య విబేధాలకు ఎంత మాత్రం ఆస్కారం ఉండరాదని శనివారం ఇక్కడ జరిగిన భారతీయ భాషల కేంద్ర సంస్థ (సీఐఐఎల్) స్వర్ణోత్సవాల సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు ‘ఎవరిపైనా ఏ భాషను రుద్దడానికి వీల్లేదు, అలాగే ఏ భాష పట్ల వ్యతిరేకత ఉండకూడదు’ అని అన్నారు. భాషలను పరిరక్షించుకోవడానికి అవసరాలకు అనుగుణంగా వాటిని అభివృద్ధి చేసుకోవడానికి బహుముఖ దృక్పధం అవసరం అని అన్నారు. దేశ వ్యాప్తంగా భాషా విద్యకు సంబంధించి సరికొత్త ఆలోచనలను పాదుకొల్పాలని, ఇందు కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో మాతృ భాషను ప్రాథమిక స్థాయిలో బోధనా భాషగా మార్చడం ఎంతైనా ఉపయుక్తం అవుతుందని ఆయన తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాతృ భాషలో బోధన జరగడం వల్ల మెదడు పెరగడానికి, ఆలోచనలు విస్తరించడానికి ఎంతో అవకాశం ఉంటుందన్న విషయం అనేక అంతర్జాతీయ అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు దీని వల్ల పిల్లల్లో సృజనాత్మకత, సహేతుక ఆలోచనలు కూడా పెంపొందుతాయని, క్రమానుగతంగా పిల్లలకు వివిధ భాషలను నేర్పడం వల్ల వారిలో జిజ్ఞాస విస్తరిస్తుందని, నేర్చుకోవాలన్న ఆరాటం పెరుగుతుందని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం ముసాయిదా పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన మాతృ భాషల్లో విద్యా బోధనకు సంబంధించి ఇందులో ఎన్నో సూచనలు చేశారని, వీటిలో గిరిజన భాషలను కూడా చేర్చినట్లు ఆయన చెప్పారు.
పిల్లల్లో బహుముఖ రీతిలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకునే చొరవ, సామర్థ్యం ఉంటాయని, వాటిని ప్రాథమిక స్థాయిలోనే ప్రోత్సహించడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఇళ్ళల్లోనూ, పరస్పరం మా ట్లాడుకునేప్పుడు, సమావేశాల్లోనూ, పాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రజలు మాతృ భాషలోనే మాట్లాడుకోవడం వల్ల దీనిపై మరింత పట్టు పెరగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు తమత మ భాషల్లో మాట్లాడడం, రాయడంలో ఎంతో హుందాతనం ఉంటుందనేది ఎంతైనా వాస్తవం అని వెంకయ్య నాయుడు అన్నారు. భాష అనేది అభివృద్ధికి అనేక రకాలుగా దోహదం చేయాలని పేర్కొన్న ఆయన సుపరిపాలనలో భాషాభివృద్ధి అంతర్భాగం కావాలన్నారు.

చిత్రం... మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) స్వర్ణోత్సవ వేడుకల
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకు జ్ఞాపికను బహూకరిస్తున్న దృశ్యం