జాతీయ వార్తలు

చందమామ రమ్మంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూలై 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బృహత్తర ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడున్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3-ఎం1 రాకెట్ ద్వారా జాబిలమ్మ యాత్రకు చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపుతోంది. అగ్ర దేశాలు చేయని పనిని మన శాస్తవ్రేత్తలు ఎన్నో అవరోధాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక పరీక్షలు నిర్వహించినంతరం చంద్రుని మీదకు పరిశోధనకు అర్భిటర్, విక్రమ్ అనే ల్యాండర్, ప్రగ్యాన్ అనే రోవర్‌ను పంపుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ )నుంచి ఈ నెల 15న సోమవారం తెల్లవారు జామున 2:51గంటలకు చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిని షార్‌లో శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఈ ప్రయోగ దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె శివన్ శనివారం షార్‌కు చేరుకున్నారు. ముందుగా ఆయన రాకెట్ విజయం కోసం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో డాక్టర్ బిఎన్ సురేష్ అధ్యక్షతన జరిగింది. ఎం ఆర్ ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారు సమావేశమై ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సంసిద్ధత తెలిపారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 6:51గంటలకు ప్రారంభించనున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌లోని మూడో దశలో ధ్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇంధనం విజయవంతంగా నింపిన అనంతరం రాకెట్‌లోని అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. అన్ని వ్యవస్థల పనితీరును భాగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న అనంతరం ప్రయోగానికి 8గంటల ముందు రాకెట్‌కు విద్యుత్ సరఫరా ఇచ్చి మిషన్ కంట్రోల్
సెంటర్‌లో ఉన్న సూపర్ కంప్యూటర్లకు అనుసంధానం చేసి అక్కడ నుంచి ప్రయోగాన్ని పరిశీలిస్తారు.
చంద్రయాన్-2లో ఎన్నో ప్రత్యేకతలు
ఇస్రో ప్రయోగిస్తున్న చంద్రయాన్-2లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అయిన ఘనత ఇంతవరకు మరే మిషన్‌కు లేదు. ఆ ఘనత చంద్రయాన్-2కే దక్కుతుంది. రోవర్ పనిచేయడానికి అవసరమైనంత సౌరశక్తిని లభించేందుకు వీలుగా ధారాళంగా సూర్యకాంతిని పడడం.. దాదాపు ఆ ప్రాంతమంతా చదునుగా ఉండడం.. సురక్షిత ల్యాండింగ్‌కు అవకాశం ఉండడం, ఈ కారణాలన్నింటి రీత్యా ల్యాండిగ్‌కు ఇస్రో ఆ ప్రదేశాన్ని ఎంచుకొంది. చంద్రయాన్-2 వ్యోమనౌక బరువు 3.8 టన్నులు కాగా అందులో ఉండే మాడ్యూల్స్ 3. (అర్భిటర్, లాండర్ (విక్రమ్), రోవర్ (ప్రగ్యాన్). మన దేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడుగా భావించే ప్రముఖ శాస్తవ్రేత్త విక్రమ్ సారాభాయ్‌కి నివాళిగా ల్యాండర్‌కు ‘విక్రమ్’ అని పేరుపెట్టారు. ఇక ప్రగ్యాన్ అంటే ప్రజ్ఞానం.. తెలివి, బుద్ధి అని అర్థం. చంద్రయాన్-2 మిషన్ మొత్తం బరువు 3,877కిలోలు కాగా ల్యాండర్ బరువు 1471 కిలోలు, రోవర్ బరువు 27కిలోలు. ప్రయోగ సమయంలో అర్బిటర్, ల్యాండర్ కలిసి ఒకే మాడ్యూల్‌గా ఉంటాయి. ల్యాండర్‌లో మాత్రం రోవర్ ఉంటుంది. వాహక నౌక ఆ మాడ్యూల్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టాక అర్బిటర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌లో అది చంద్రుడి సమీపానికి చేరుతుంది. అక్కడికి చేరాక ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడివడి చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నిర్ణీత ప్రదేశంలో దిగుతుంది. అనంతరం దానిలో ఉన్న ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి తన పరిశోధన మొదలు పెడుతుంది. అర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్ చంద్రుడిపై దిగి రోవర్‌ను విడిచిపెడుతుంది. ఈ మూడు కలిసికట్టుగా పనిచేస్తూ చంద్రుడిపై నీటి జాడకోసం అనే్వషిస్తాయి. ఖనిజాలు, ఇతర మూలకాలపై కూడా అధ్యయనం చేస్తాయి. రోవర్, ల్యాండర్ జీవిత కాలం ఒక చంద్రదినం అనగా భూమి మీద 14రోజులతో సమానం. చందమామ చుట్టూ తిరిగే అర్బిటర్ జీవిత కాలం ఒక ఏడాది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం చంద్రుని సమీపానికి వెళ్లాక అర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడి సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే ఘట్టమే. ఇందుకు పట్టే సమయం 15నిమిషాలు మాత్రమే. ఇంత కీలకమైన ఆపరేషన్‌ను ఇస్రో మునుపెన్నడూ చేపట్టలేనందున ఆ 15 నిమిషాలను టెర్రిఫయింగ్ మూమెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగి పదిహేను నిమిషాల్లోపే దానికి సంబంధించిన ఛాయాచిత్రాలను భూమికి అందుతాయి. అయితే ల్యాండర్ దిగిన నాలుగు గంటల తర్వాత దాన్నుంచి రోవడ్ బయటకొస్తుంది. చంద్రయాన్-2 మిషన్‌ను ఖర్చు రూ.603కోట్లు కాగా దాన్ని మోసుకెళ్లే వాహక నౌక ఖర్చు రూ.375కోట్లు. ఇప్పటికే 11సంవత్సరాల క్రితం చంద్రయాన్-1 ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించి ఉంది. అదే విధంగా అంగారక ఉపగ్రహంపై పరిశోధనకు కూడా మామ్ ఉపపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించారు. చంద్రయాన్-2 విజయవంతమైతే తర్వాత సూర్యుని పైకి ఆదిత్య ఉపగ్రహాన్ని పరిశోధనల నిమిత్తం పంపేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే మావన సహిత ప్రయోగాలకు మార్గం సుగమమం అయినట్లే.
ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ 14న సాయంత్రం షార్‌కు రానున్నారు. రాత్రికి అక్కడే బసచేసి 15న తెల్లవారుజామున ప్రయోగాన్ని వీక్షించి తిరిగి పయనమవ్వనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో షార్‌ను పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ భద్రత వలయంలోకి తీసుకొన్నారు.

చిత్రాలు.. ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3 రాకెట్

*చంద్రయాన్-2 మిషన్‌లో అర్బిటర్, *ల్యాండర్ (విక్రమ్) (1471 కిలోలు), *రోవర్ (ప్రగ్యాన్) (27 కిలోలు)