జాతీయ వార్తలు

డుమ్మా కొడితే దండనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్న మంత్రులపై చర్య తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించినట్లు తెలిసింది. బీజేపీ వారాంతర పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్ర మోదీ ఈ హెచ్చరిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరుకాకుండా మీరేం చేస్తున్నారు? అంటూ ఆయన మంత్రులను నిలదీశారని అంటున్నారు. నరేంద్ర మోదీ గత వారం జరిగిన వారాంతపు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటుకు హాజరు కాని ఎంపీలకు క్లాసు పీకడం తెలిసిందే.
ఇప్పుడు ఆయన మంత్రులు క్రమం తప్పకుండా పార్లమెంటుకు రావాలంటూ క్లాస్ తీసుకున్నారు. పార్లమెంటు ఉభయ సభలకు మంత్రులు క్రమం తప్పకుండా హాజరు కావడంపై ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాం.. దాని ప్రకారం ప్రతి మంత్రి తనకు కేటాయించిన సమయంలో కేటాయించిన సభలో తప్పకుండా ఉండాలి కానీ కొంతమంది గైర్హాజరవుతున్నారు.. ఎందుకిలా జరుగుతోంది అని నరేంద్ర మోదీ నిలదీశారు. రోస్టర్ డ్యూటీ ఉన్నప్పటికీ పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొడుతున్న మంత్రుల జాబితాను వెంటనే తనకు అందజేయాలని నరేంద్ర మోదీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆదేశించినట్లు తెలిసింది. రోస్టర్ డ్యూటీ ప్రకారం మంత్రులు సభలో లేకపోవడం వలన ప్రతిపక్షం విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.. లోక్‌సభలో ఇంత మెజారిటీ ఉన్నా మంత్రులు గైర్హాజరు కావడం వలన పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటోందని ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారని తెలిసింది. బీజేపీ ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు చేరువకాగలుగుతారు.. ఎంపీలు ప్రజలకు చేరువైనప్పుడే బీజేపీకి మంచి పేరు వస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. మీరంతా రాజకీయాలను పక్కనబెట్టి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి.. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేసినప్పుడే ఆశించిన ఫలితాలను సాధించగలుగుతామని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు హితవు చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ప్రస్తావిస్తూ బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గట్టిగా కృషి చేయాలి.. స్థానిక అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించడంతోపాటు ప్రజలకు తాగునీటి సమస్య ఎదురుకాకుండా చూసేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీలు వినూత్న పద్ధతిలో పనిచేయాలి.. స్థానిక పురపాలక అధికారులతో కలిసి పనిచేయాలని నరేంద్ర మోదీ వారికి సూచించారు. బడ్జెట్ కేటాయింపులు, ముఖ్యంగా వివిధ శాఖల పద్దులపై చర్చ జరిపేందుకు అవసరమైతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను పొడిగిస్తామని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలతో చెప్పారు. ప్రధాన మంత్రి ఎంపీలకు ఇచ్చిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమావేశానంతరం విలేఖరులతో చెప్పారు.
చిత్రం...ఢిల్లీలో మంగళవారం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా,
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు