జాతీయ వార్తలు

ఆజం ఖాన్‌పై భూ ఆక్రమణ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూలై 23: రాంపూర్‌లో భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ తమ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు ఆజం ఖాన్‌పై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారంనాడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సమాజవాది పార్టీ (ఎస్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీసింది. సమావేశంలోని జీరో అవర్‌లో ఎస్పీ సభ్యుడు నరేంద్ర వర్మ వాయిదా నోటీసు ద్వారా సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. సమాజవాది పార్టీకి చెందిన నాయకుడు రామ్ గోవింద్ చౌదరి ఇదే అంశంపై మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపించారు. రాంపూర్ పార్లమెంటు సభ్యుడు ఆజం ఖాన్‌పై 12 ఏళ్ల తర్వాత భూ ఆక్రమణ కేసు కింద ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, ఈ చర్య సమాజవాది పార్టీతోపాటు మైనారిటీలను కించపరిచేదిగా ఉందని ఆయన విమర్శించారు. భూ ఆక్రమణ కేసు ఎదుర్కొంటున్న రాష్ట్ర మాజీ మంత్రి ఆజం ఖాన్ వ్యవహారంపై వాస్తవాలు తెలుసుకునేందుకు వీలుగా అన్ని పార్టీలతో కూడిన కమిటీని రాంపూర్‌కు పంపాలని ఆయన సభలో డిమాండ్ చేశారు. ఇదిలావుండగా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రాష్ట్ర మంత్రి సురేష్ ఖన్నా ఈ సందర్భంగా మాట్లాడుతూ చట్ట ప్రకారమే ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్‌పై కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాంపూర్ జిల్లా పాలకవర్గం తమకు అందజేసిన సుదీర్ఘ నివేదికను మంత్రి సభలో చదివి సభ్యులకు వినిపించారు. ‘ఎవరైనా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నారంటే దానిని స్వాగతించాల్సిందే. కానీ పేదలు, కూలీలకు చెందిన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలను చేపడితే ఏమాత్రం సహించం’ అని మంత్రి హెచ్చరించారు. ఎస్పీ నాయకుడు ఆజం ఖాన్ ఇపుడు ‘తప్పుడు ప్రకటనలు’ చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కాగా, ఇదే అంశంపై ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం చెప్పే అంశాలను వినాలని చేసిన అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఎస్పీ సభ్యులంతా ఒక్కసారిగా లేచి శాసనసభ నుంచి బయటకు వస్తూ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.