జాతీయ వార్తలు

ఓటేస్తే ‘ఉత్తమ’ప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహోబా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 24: దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి రహిత వాతావరణాన్ని సృష్టించేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)ల ఉచ్చునుంచి బయటపడి ఈసారి బిజెపికి ఓటు వేయాలని సోమవారం ఆయన మహోబాలో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఎన్నో రకాల రాజకీయాలను చూసిన ఉత్తరప్రదేశ్‌లో అన్ని రకాల ఆటలు సాగాయి. ఇక్కడ ఆడాలనుకున్న వారు ఆడారు. ఏదైనా పొందాలనుకున్న వారు దానిని పొందారు. రాష్ట్రాన్ని కొంతకాలం సమాజ్‌వాదీ పార్టీ, మరికొంత కాలం బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలించాయి. కానీ మీ జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. వచ్చే పదేళ్లలో ఉత్తరప్రదేశ్‌ను ‘ఉత్తమప్రదేశ్’గా మార్చాలని మీరనుకుంటే ఎస్‌పి, బిఎస్‌పిల ఉచ్చునుంచి బయటపడి ఈసారి శాసనసభ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి’ అని మోదీ పేర్కొన్నారు.
గత 15 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఎస్‌పి, బిఎస్‌పి తోడుదొంగలుగా మారి తమ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నాయని ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు అవినీతి కేసుల విషయమై ఒకరి నొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న ఈ రెండు పార్టీల నేతలు తీరా ఎన్నికలు ముగిసి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ కేసులకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. ‘ఐదేళ్ల పాలనలో బిఎస్‌పి అవినీతి కేసుల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక్క వ్యక్తినైనా జైలుకి పంపలేదు. ఇప్పుడు ఎస్‌పి కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీల నాయకులు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు. ఎప్పటినుంచో ఇలాగే ఆటలాడుతున్న ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి’ అని మోదీ నిప్పులు చెరిగారు. కేంద్రంలో రెండున్నర ఏళ్ల క్రితం తన ప్రభుత్వం అధికార పగ్గాలను చేపట్టిన నాటినుంచి ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘2014 సంవత్సరానికి ముందు వెలువడిన వార్తాపత్రికలను తిరగేస్తే మీకు ప్రతి పేజీలో అవినీతి కేసులే దర్శనమిస్తాయి. కానీ గత రెండున్నరేళ్లలో మీరు కనీసం ఒక్క అవినీతి కేసును గానీ లేదా కుంభకోణాన్ని గానీ చూశారా? దేశంలో నిజాయతీపరులైన అధికారులు, ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. కావల్సిందల్లా వారికి సాధికారత కల్పించడమే’ అని మోదీ పేర్కొంటూ, ఉత్తరప్రదేశ్‌లో అవినీతి క్రీడకు ముగింపు పలకాల్సిందేనని స్పష్టం చేశారు.

చిత్రం.. మహోబాలో సోమవారం బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న మోదీ