జాతీయ వార్తలు

తీరని నగదు కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన వెలువడినప్పటినుంచి మొదలైన సామాన్యుల నగదు కష్టాలు అయిదు రోజులైనా తీరలేదు. నిజానికి సెలవు రోజయిన ఆదివారంనాడు మరింతగా పెరిగాయి. దేశంలో ఎక్కడ చూసినా బ్యాంకులు, ఎటిఎంల ముందు డబ్బులకోసం వచ్చిన జనాల పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. బుద్ధపూర్ణిమ కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు కావడంతో చేతుల్లో డబ్బులు లేక అవస్థలు పడుతున్న జనం బ్యాంకు కార్యాలయాలకు ఎగబడ్డారు. ఎటిఎంలలో నగదు లేకపోవడం, ఒకవేళ ఉన్నా ఒకటి, రెండు గంటల్లోనే అయిపోతూ ఉండడంతో జనం నేరుగా బ్యాంకు కార్యాలయాలకే పరుగులు పెట్టారు. ఈ రోజు బ్యాంకులకు పరీక్షా సమయం అని, సెంట్రల్ ఢిల్లీలో ఓ జాతీయ బ్యాంక్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. విపరీతంగా ఉన్న రద్దీని తట్టుకోవడానికి చాలా బ్యాంకు శాఖల్లో అదనపు కౌంటర్లను తెరవడంతోపాటు ఎజిఎంలు, డిజిఎంలు లాంటి మధ్యస్థాయి అధికారులు సైతం నగదు పంపిణీ చేయడం కనిపించింది.
కోల్‌కతాలో ఆదివారం ఉదయానే్న నిద్రలేచిన జనాలకు బ్యాంకు శాఖలు, ఎటిఎంల ముందు మైళ్లకొద్దీ క్యూలు స్వాగతం పలికాయి. ఆదివారం ఉదయం పూట సాధారణంగా కోల్‌కతాలో పాల బూత్‌లు, చేపల మార్కెట్ల వద్ద భారీ రద్దీ కనిపించేది. అయితే ఈ రోజు మాత్రం అవన్నీ వెలవెలబోగా, బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం గుంపులు కనిపించాయి. ‘సాధారణంగా ఆదివారం ఉదయం నేను లక్ష రూపాయల చేపలు అమ్మేవాడిని. అయితే ఈ రోజు కొన్ని వేల రూపాయల చేపలు మాత్రమే అమ్మగలిగాను’ అని నగరంలో అతిపెద్ద చేపల మార్కెట్ అయిన లేక్ మార్కెట్‌లోని అపు నస్కర్ అనే ఓ చేపల వ్యాపారి చెప్పడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్నిచోట్లయితే పాత 500, వెయ్యి రూపాయలు తీసుకుంటామంటూ చేపల దుకాణాల ముందు బోర్డులు పెట్టుకుని ఉండడం కనిపించింది. కస్బా సిఐటి మార్కెట్‌లో ఓ చేపల వ్యాపారి అయితే 300 రూపాయల చేపలు కొన్నట్లయితే పాత 500, వెయ్యి రూపాయల నోట్లు తీసుకుంటానంటూ మెడలో బోర్డు తగిలించుకుని కనిపించాడు. కాగా, బ్యాంకు శాఖల్లోంచి డబ్బులు డ్రా చేసుకున్న కొద్దిమంది సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఎక్కడికి వెళ్లినా 2 వేల రూపాయల నోటుకు చిల్లర దొరక్క నానా అవస్థలు పడాల్సి వచ్చిందని వారంతా వాపోయారు.
పాతనోట్లు చించి పడేశారు
కోల్‌కతాలోని గోల్ఫ్ గ్రీన్ ఏరియాలో ఆదివారం ఓ చెత్త కుండీలో చించేసిన 500, వెయ్యి రూపాయల నోట్లతో నిండిన రెండు బస్తాలు కనిపించాయి. తెల్లవారుజామున చెత్తకుండీలో చించేసిన ఈ నోట్లను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నోట్లు ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సిసి టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
ముంబయిలోనూ తప్పని కరెన్సీ కష్టాలు
ఆర్థిక రాజధాని ముంబయిలోను ఇదే పరిస్థితి కనిపించింది. అన్ని బ్యాంకుల శాఖలు, ఎటిఎంల ముందు పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. అయితే చాలా బ్యాంకు శాఖల్లో వంద రూపాయల నోట్ల కొరతతోపాటుగా 2 వేల రూపాయల కొత్త నోట్లు కూడా తక్కువగా ఉండడంతో క్యూలో ఎక్కువ సేపు వేచి ఉండాల్సిరావడంతో జనం విసిగిపోయి బ్యాంకు సిబ్బందితో గొడవ పడసాగారు. క్యూలో చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు కూడా ఉండడంతో పరిస్థితి మరీ క్లిష్టంగా మారింది. వంద రూపాయల నోట్లు అయి పోయాయని, కొత్త నోట్లు కూడా తగినన్ని సరఫరా చేయలేదని కొన్ని సహకార బ్యాంకులు చెబుతున్నాయని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేవారు. ఒకవేళ అదే నిజమైతే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా సుజ్రు గ్రామంలో బ్యాంకు వద్ద పాత నోట్లు మార్చుకోవడానికి వచ్చిన జనం బ్యాంకు సిబ్బందితో గొడవ పడి బ్యాంకుపై రాళ్ల వర్షం కురిపించడంతో ఒక మహిళ సహా ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని జనాన్ని తరిమికొట్టారు. ఈ సంఘటనకు సంబంధించి వందమందికి పైగా జనంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నకిలీ నోట్లతో మహిళ అరెస్టు
కేరళలోని మలప్పురం జిల్లాలోని ఒక ఎస్‌బిఐ శాఖలో దాదాపు 37 వేల విలువైన నకిలీ నోట్లను మార్చడానికి ప్రయత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. మరియమ్మ అనే మహిళ 45 వేల రూపాయలు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు రాగా వాటిలో 37 వేల రూపాయల విలువైన నకిలీ వెయ్యి రూపాయల నోట్లు కనిపించడంతో బ్యాంకు అదికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గల్ఫ్‌లో ఉన్న తన పిల్లలు ఈ డబ్బు పంపించినట్లు ఆమె చెప్పిందని పోలీసులు తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో ఆమెను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాలీవుడ్ తారలు షాహిద్ కపూర్, దీపికా పదుకోనె, కరీనా కపూర్ ప్రశంసించారు. ఇది చాలా మంచి నిర్ణయమే కాకుండా అవినీతిని అంతం చేయడానికి దోహదపడే సాహసోపేతమైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు.

చిత్రాలు..న్యూఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ వద్ద,
ఎస్‌బిఐ ఎటిఎం వద్ద ఆదివారం కనిపించిన క్యూలైన్లు