జాతీయ వార్తలు

రద్దుపై రగడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: నోట్ల రద్దు పార్లమెంట్ ఉభయ సభల్లో పెద్ద దుమారం రేపనుంది. సర్కారు నిర్ణయాన్ని అన్ని కోణాల్లో తప్పుబడుతున్న విపక్షాలు, అస్తశ్రస్త్రాలతో మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమాయత్తమయ్యాయి. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా కోట్ల జనం పడుతున్న కష్టనష్టాలను పార్లమెంట్ సాక్షిగా లేవనెత్తబోతున్నాయి. సర్కారు ఆకస్మిక నిర్ణయ వెనుకవున్న అనౌచిత్యాన్నీ ముక్తకంఠంతో ప్రశ్నించబోతున్నాయి. విపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కోడానికి అధికార పక్షం సైతం సన్నద్ధమైంది. దేశంలో నల్లధన నియంత్రణకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై ఎదురుదాడి జరపాలన్న ప్రతివ్యూహంతో ఎన్డీయే కనిపిస్తోంది. దీంతో పెద్ద నోట్ల రద్దుపై ఇరుపక్షాలు తమతమ వ్యూహాలతో పార్లమెంట్‌లో పెద్ద దుమారానే్న రేపనున్నాయి.
నోట్ల రద్దును వ్యతిరేకించే అంశంపై రెండుగా చీలిపోయిన విపక్షాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎన్డీయేను ఎండగట్టాలన్న అంశంపై గట్టిగానే ఉన్నారు. విపక్షాల దాడిని గట్టిగా తిప్పికొట్టేందుకు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలూ నడుంబిగించాయి. పెద్ద నోట్ల రద్దును అడ్డుకోవడం దేశంలోని అవినీతి, నల్లధనాన్ని సమర్థించడమేనన్న వాదనతో ప్రభుత్వం ప్రతిదాడికి సిద్ధమైంది. 500, 1000 నోట్ల రద్దు, ఒకే ర్యాంకు ఒకే పింఛన్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో సిమి కార్యకర్తలు ఎదురుకాల్పుల్లో మరణించటం వంటి మూడు ముఖ్యమైన అంశాలపై ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి. నేడు పార్లమెంటు ఉభయ సభలు సమావేశం కాగానే పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈమేరకు ప్రతిపక్షాలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసులిచ్చాయి. పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన అంశాలపై లోతుగా చర్చ జరపకుండా ఇతర అంశాలను చేపట్టేందుకు వీల్లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. అయితే పెద్ద నోట్ల రద్దుపై ఎన్డీయేను ఏవిధంగా విమర్శించాలనే అంశంపై మాత్రం విపక్షాలు ఒక అవగాహనకు రాలేకపోయాయి. నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తక్షణం ఉపసంహరించాలని పశ్చిమ బెంగాల్ సిఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సిఎం, ఆం ఆద్మీ అధినేత అరవింద్
కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. ఆమేరకు ఎన్డీయేను ఆదేశించాలని కూడా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కోరాలని అనుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్, వామపక్షాలు, జెడి (యు), ఆర్‌జెడి, సమాజ్‌వాదీ, ఎన్‌సిపి తదితర పార్టీలు మాత్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించటం లేదు. రద్దు నిర్ణయాన్ని మార్చుకుంటే సరిపోతుందని అంటూనే, ప్రజలకు కొత్త నోట్ల పంపిణీలో సర్కారు విఫలమైందని ఆరోపిస్తున్నాయి. ముందస్తు ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను ఎందుకు రద్దు చేశారని పార్టీలు నిలదీస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై జెపిసిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఇతర విపక్ష పార్టీలు పట్టించుకోవటం లేదు. జెపిసిని ఏర్పాటు చేసినంత మాత్రాన ఎలాంటి ఫలితం ఉండదు కనుక, నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వొత్తిడి చేయాలని మమతా బెనర్జీ వాదిస్తున్నారు. మమత డిమాండ్‌తో వామపక్షాలు ఏకీభవించటం లేదు. రద్దు నిర్ణయం ఉపసంహరించాలని డిమాండ్ చేసే బదులు, ముందస్తు ఏర్పట్లు చేపట్టకుండా ఎందుకు రద్దు చేశారనే వామపక్షాలు ప్రశ్నించనున్నాయి. జెడి(యు) అధినేత శరద్ యాదవ్ కూడా ఇదేవిధంగా ఆలోచిస్తున్నారు. మొత్తంమీద ప్రతిపక్షాలు నేడు ఉభయ సభలు ప్రారంభం కాగానే పోడియం వద్దకు దూసుకొచ్చి రద్దుపై రాద్ధాంతం చేయాలన్న ఆలోచనలోనే ఉన్నాయి.
రద్దుపై చర్చకు సిద్దం
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై లోతుగా చర్చించేందుకు ఎన్డీయే సర్కారు సిద్ధంగా ఉంది. ఉభయ సభల్లో దీనిపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని, అయితే చర్చ సుహృద్భావ వాతావరణంలో జరగాలని బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా చూసేందుకు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గత రాత్రి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సమాలోచనలు జరిపారు. పెద్ద నోట్ల రద్దుపై చర్చించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ సమావేశంలో స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలకు ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్లు ఆశించిన స్థాయిలో అందకపోవటం వలన ప్రజలు కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏంచెప్పినా ప్రతిపక్షాలు మాత్రం బుధవారం ఉదయం పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్డీయేను ఉతికి ఆరేసి సభా కార్యక్రమాలు స్తంభింపచేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తమ సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకు ముందే తెలియజేసిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేయటం ద్వారా తమను ఇబ్బందుల్లో పడేసిన బిజెపి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని ఎలా దెబ్బ తీయాలనే అంశంపై విపక్షాలు రెండుసార్లు సమావేశం జరిపి వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి.