జాతీయ వార్తలు

మతం వ్యక్తిగతం..జోక్యం కూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం చాలా వ్యక్తిగతమైనదని, ఇతరులెవరూ ఈ అంశంలో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. సమాజంలో శాంతికి సహనం ఎంతయినా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. రాజకీయ సైద్ధాంతిక విభేదాలకన్నా మత యుద్ధాలలోనే ఎక్కువమంది ప్రజలు చనిపోయారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రోహింటన్ ఎఫ్ నారిమన్ రచించిన ‘ద ఇన్నర్ ఫైర్, ఫేత్, చాయిస్ అండ్ మాడర్న్ డే లివింగ్ ఇన్ జోరోఆస్ట్రియనిజం’ పుస్తకాన్ని ఠాకూర్ ఆదివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో మత విశ్వాసాల పేరిటే ఎక్కువ విధ్వంసం, రక్తపాతం జరిగిందని అన్నారు. ‘ఈ ప్రపంచంలో రాజకీయ సైద్ధాంతిక విభేదాలకన్నా మత యుద్ధాలలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు. వివిధ విశ్వాసాలకు చెందిన అనేక మంది ప్రజలు పరస్పరం చంపుకున్నారు. ఎందుకంటే ఎవరికి వారు తాము అనుసరిస్తున్న మార్గం ఇతరుల కన్నా ఉత్తమమైనదని భావించారు. ఇతరులను మత విశ్వాసం లేని వారనో, నాస్తికులనో భావించారు. మత విశ్వాసాల కారణంగానే ఈ ప్రపంచంలో విపరీతమైన విధ్వంసం, రక్తపాతం జరిగింది’ అని ఠాకూర్ అన్నారు. ‘నా మతం ఏది? నేను నా దేవుడితో ఎలా అనుసంధానం కావాలి? నేను నా దేవుడితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి? అనేది ఇతరులకు సంబంధించిన వ్యవహారం కాదు. నీకు నీ దేవుడితో ఎలాంటి సంబంధం కావాలో నీవు ఎంపిక చేసుకోవచ్చు’ అని ఠాకూర్ అన్నారు. ‘సౌభ్రాతృత్వం, సహనాన్ని బోధించే సందేశాన్ని స్వీకరించడం ద్వారా చివరకు అన్ని మార్గాలు ఒకే దేవుడికి దారితీస్తాయని, శాంతిని, సౌభాగ్యాన్ని తీసుకువస్తాయని’ అని ఠాకూర్ పేర్కొన్నారు. ఈ అర్థంలోనే రోహింటన్ గొప్ప సేవ చేశారని ఆయన కొనియాడారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్ శ్రీకృష్ణ మాట్లాడుతూ జోరోఆస్ట్రియన్ల పవిత్ర గ్రంథం అయిన గాథాస్‌లోని కొన్ని పద్యాలను చదివి వినిపించారు. గాథాస్‌కు రుగ్వేదంతో ఉన్న సంబంధాన్ని, సంస్కృతంతో ఉన్న పోలికలను వివరించారు. రోహింటన్ తండ్రి ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రోహింటన్ ఎఫ్ నారిమన్ రచించిన ‘ద ఇన్నర్ ఫైర్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్టున్న చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్. చిత్రంలో రిటైర్డ్ జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ