జాతీయ వార్తలు

నగదో నారాయణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: నగదుకు కొరత లేదని ఆర్‌బిఐ హామీల మీద హామీలు గుప్పిస్తున్నా, బ్యాంకుల ముందు పెద్ద క్యూలు, నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్న ఏటిఎంలు వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. దేశంలో పెద్ద నోట్లు రద్దయ 21 రోజులైనా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. మరోపక్క రానున్న మూడు రోజులు భారీగా నగదుకు డిమాండ్ ఉండేవే కాబట్టి ఆ డిమాండ్‌కు తగ్గట్టుగా బ్యాంకులు సన్నద్ధమయ్యేందుకు ప్రయత్నిస్తున్నా ఏ రకమైన వెసులుబాటు కనిపించే అవకాశం లేదు. ముఖ్యంగా ఎక్కడా ఏటిఎంలలో నగదు లేకపోవడం, పెట్టిన మొత్తమంతా మొదటి గంటలోనే అయిపోవడంతో వేలాదిమంది నిస్సహాయంగానే వెనుదిరగాల్సిన పరిస్థితి మంగళవారం తలెత్తింది. చాలాచోట్ల ఏటిఏంల ముందే కాకుండా బ్యాంకుల ముందు కూడా నో క్యాష్ బోర్డులు కనిపించడం ప్రజల్లో తీవ్రస్థాయిలో నిరాశా నిస్పృహలను రేకెత్తించింది. డిసెంబర్ 1న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందికి జీతాలు, లక్షలాదిమందికి పెన్షన్లు క్రెడిట్ చేయాల్సిన రోజు కాబట్టి ఆ రోజు పరిస్థితి ఏమిటన్న దానిపై సర్వత్రా గందరగోళం నెలకొంది. 50 లక్షలమంది కేంద్ర సిబ్బంది ఉండగా, 58 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. నాన్ గెజిటెడ్ సిబ్బందికి పదివేల రూపాయల అడ్వాన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా అది కంటితుడుపు చర్యేనని బ్యాంకు సిబ్బంది అంటోంది. ఇప్పటికే బ్యాంకుల్లో సరిపడ నగదు లేకపోవడం, ఏటిఎంలు అడుగంటిపోవడంతో రానున్న ఒత్తిడిని తట్టుకోవడం దాదాపు అసాధ్యమేనన్న అభిప్రాయాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ‘మమ్మల్ని ఆదుకోండి’ అంటూ ఆర్‌బిఐకి మొరపెట్టుకున్నారు. అదనపు నగదు ఇస్తే తప్ప డిసెంబర్ 1 తర్వాత వచ్చే ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి ఉండదని చేతులెత్తేస్తున్నారు. మరోపక్క ఏటిఎంల్లో వచ్చే నగదుకోసం బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిన ప్రజల్లో సహనం నశిస్తోంది. నిస్సహాయత రూపంలో వారిలో ఆక్రోశం వెల్లువెత్తుతోంది. దాదాపు 70 శాతానికి పైగా ఏటిఎంలను కొత్త కరెన్సీకి అనుగుణంగా సాంకేతికంగా తీర్చిదిద్దినప్పటికీ చాలావాటిల్లో నగదు లేకపోవడం ప్రజలకు ఏరకంగానూ ఊరట లభించడం లేదు. ఇప్పటికే 2000 నోటుకు చిల్లర లేక వేలాదిగా చిన్న వ్యాపారాలన్నీ అడుగంటిపోయాయి. రోజువారీ కూలీలకు పనిలేక దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది. రానున్న రబీ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో నగదు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ప్రభావం పట్టణ ప్రాంతాలపై మరింతగా పడే అవకాశం కనిపిస్తోంది. చాలాచోట్ల బ్యాంకుల వద్ద వందలాదిగా జనం క్యూలు కట్టడానికి ప్రధాన కారణం కొద్దిమందికే నగదు అందడం, మిగతా వారందరూ వట్టి చేతులతో వెనక్కి మరలడం, బ్యాంకులకు సరిపడ నగదు అందకపోవడమేనని చెబుతున్నారు.

చిత్రం..హైదరాబాద్ నగరంలో మంగళవారం ఓ బ్యాంకు ముందు బారులు తీరిన ఖాతాదారులు