జాతీయ వార్తలు

బంగారంపై బెంగ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: బంగారంపై కేంద్రం పన్ను విధిస్తుందని, జరిమానా వేస్తుందంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ, ప్రత్యక్ష పన్నుల విభాగం(సిబిడిటి) వివరణ ఇచ్చాయి. పసిడిపై పన్నుకు సంబంధించి వస్తున్న వదంతులు వేటినీ నమ్మరాదంటూ గురువారం సిబిడిటి స్పష్టమైన ప్రకటన చేసింది. వారసత్వంగా సంక్రమించిన బంగారంపై కానీ, వెల్లడించిన ఆదాయంతో కొన్న బంగారంపై కానీ ఎలాంటి పన్నూ ఉండవని తేల్చి చెప్పింది. లోక్‌సభ గత వారం ఆమోదించిన ఆదాయపు పన్ను సవరణ చట్టంలో బంగారానికి సంబంధించి ఎలాంటి కొత్త నిబంధన లేదని స్పష్టం చేసింది. లోక్‌సభ ఆమోదించిన చట్ట సవరణ బిల్లులో కేవలం నల్లధనం ఉన్నవాళ్లు నిర్దిష్ట గడువులోగా వెల్లడించని ఆదాయంపై 85శాతం వరకు పన్నును విధించేందుకు వీలుగా మాత్రమే సవరణను ప్రతిపాదించినట్లు సిబిడిటి ప్రకటంచింది. బంగారం, ఆభరణాలపై కేంద్రం భారీగా పన్నును విధించబోతున్నట్లు గురువారం ఉదయం నుంచీ దేశమంతటా వార్తలు వ్యాపించాయి. మీడియాలో వరుస కథనాలు గుప్పుమనటంతో మహిళలు, మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అయింది. ఈ వార్తలతోనే మార్కెట్లో గ్రాము పసిడి ధర ఒక్కసారిగా రూ.350 వరకూ పడిపోయింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వివరంగా ప్రకటన విడుదల చేసింది. ‘‘బంగారం, ఆభరణాలకు సంబంధించి గత వారం లోక్‌సభ ఆమోదించిన ఆదాయపు పన్ను సవరణ బిల్లులో కొత్తగా ఎలాంటి సవరణలు చేయలేదు. వెల్లడించిన ఆదాయంతో కానీ, వ్యవసాయం, గృహ పొదుపు వంటి పన్ను మినహాయింపు ఉన్న ఆదాయంతో కానీ కొన్న బంగారంపై ఎలాంటి పన్ను విధించరు. దీంతో పాటు వారసత్వంగా, స్ర్తిధనం రూపంలో వచ్చిన బంగారంపైనా ఎలాంటి పన్ను ఉండదు. బంగారం పన్నుకు సంబంధించి ఇవన్నీ గతంలో ఉన్న నిబంధనలే’’నని సిబిటిడి వివరణ ఇచ్చింది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసినప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లో నియమిత పరిమాణంలో ఉన్న బంగారాన్ని జప్తు చేయబోమని సిబిడిటి స్పష్టం చేసింది. కుటుంబంలో వివాహిత మహిళ వద్ద 500 గ్రాములు, అవివాహిత మహిళ వద్ద 250 గ్రాములు, కుటుంబంలో పురుషుడి వద్ద వంద గ్రాములు ఉండవచ్చని పేర్కొంది. ఇంతకు మించి బంగారం కానీ ఆభరణాలు కానీ లభిస్తే అది వారసత్వంగా సంక్రమించిందా? లేక చట్టబద్ధమైన ఆదాయంతో కొన్నదా అన్నది వివరాలు చెప్పాలని, అలా చెప్పిన బంగారంపైనా ఎలాంటి పన్నూ విధించబోమని పేర్కొంది.
లోక్‌సభ ఆమోదించిన ఆదాయపు పన్ను సవరణ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ పరిశీలనలో ఉంది. ఐటి చట్టంలోని 115బిబిఈ క్లాజు నల్లధనం బయటపడితే 60శాతం పన్నుతో పాటు 25శాతం సర్‌చార్జి విధించేందుకు వీలు కల్పిస్తోంది. ఈ చట్టంలోని మరో క్లాజు లెక్కల్లోకి రాని ఆదాయంపై 10శాతం పెనాల్టీ కూడా విధించాలని పేర్కొంటోంది. ‘‘115బిబిఈ క్లాజులో పెంచిన పన్ను రేటు కేవలం స్వచ్ఛందంగా వెల్లడి చేయని ఆదాయానికి మాత్రమే వర్తిస్తుంది. ఎక్కడైతే బహిర్గత పరచని ఆస్తులు, నగదు ఉన్నాయో వాటికి మాత్రమే ఈ క్లాజు వర్తిస్తుంది’’ అని స్పష్టం చేసింది. దాడులు, జప్తు చేసిన ఆదాయంపై మూడు రెట్లు పెనాల్టీ వేసేందుకు కూడా ఈ సవరణ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు పార్లమెంట్ ఆమోదాన్ని పొందితే లెక్కలకు చూపించని ఆదాయంపై 30శాతం పెనాల్టీ పడుతుంది. ఒకవేళ అక్రమార్జనను అంగీకరించి పన్నులు చెల్లించినట్లయితే పన్ను, జరిమానా కలిపి మొత్తం 60శాతం వసూలు చేస్తారు.
2015-16 సంవత్సరంలో ఆదాయపు పన్నుశాఖ 445 దాడులు నిర్వహించి రూ.11,066కోట్ల రూపాయల లెక్కల్లోకి రాని సొమ్మును, రూ.712.68 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. గత మూడేళ్లలో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో సుమారుగా రూ.32, 146కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

బంగారంపై ఉన్న
పన్ను మినహాయింపులు ఇవీ..
వెల్లడించిన ఆదాయంతో కొనవచ్చు
పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం (వ్యవసాయం, గృహ పొదుపు)తో కొనుక్కోవచ్చు
వారసత్వంగా సంక్రమించిన బంగారం
స్ర్తిధనంగా వచ్చిన బంగారం
వివాహిత దగ్గర 500 గ్రాములు
అవివాహిత దగ్గర 250 గ్రాములు
పురుషుడి దగ్గర 100 గ్రాములు
మిగతా బంగారానికీ లెక్క చెప్తే మినహాయింపే