జాతీయ వార్తలు

ప్రతిష్టంభన ఆమోదయోగ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: పార్లమెంటు ప్రతిష్టంభనపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటును పనిచేయనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టసభలు ఉన్నది ధర్నాలు చేయడానికి కాదని ధ్వజమెత్తారు. సభ పనిచేయకుండా అడ్డుకోవడం అంటే మైనారిటీ సభ్యులు మెజారిటీ సభ్యుల నోరు నొక్కడమే అవుతుందని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు ఉన్నది సభలో వివిధ అంశాలపై చర్చలు జరపడానికి కాని సభను అడ్డుకోవడానికి కాదని ఆయన పేర్కొన్నారు. ‘పార్లమెంటరీ వ్యవస్థలో సభను అడ్డుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ప్రజలు సభలో చర్చించడానికి తమ ప్రతినిధులను పంపించారే తప్ప ధర్నా చేయడానికో సభలో సమస్యలు సృష్టించడానికో కాదు’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘డిఫెన్స్ ఎస్టేట్స్ డే’ను పురస్కరించుకొని గురువారం ఇక్కడ ఆయన ‘పటిష్ఠమైన ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంస్కరణలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్టప్రతి పదవిని చేపట్టడానికి ముందు సీనియర్ పార్లమెంటేరియన్ అయిన ప్రణబ్ ముఖర్జీ.. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై చర్చలో ప్రధానమంత్రి పాల్గొనాలని పట్టుబడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అంతరాయం కలిగించడం అంటే గాయపరచడమే. మీరు మెజారిటీ సభ్యుల నోరు నొక్కుతున్నారు. మెజారిటీ సభ్యులు ఎప్పుడూ అంతరాయం కలిగించరు. కేవలం మైనారిటీ సభ్యులే వెల్‌లోకి వచ్చి, నినాదాలు చేస్తారు. సభాకార్యక్రమాలను అడ్డుకుంటారు. సభాధ్యక్షుడు సభను వాయిదా వేయడం మినహా గత్యంతరం లేని పరిస్థితిని సృష్టిస్తారు. ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన అన్నారు.
పార్లమెంటు సమావేశాలు ఏడాదిలో కొన్ని వారాలు మాత్రమే జరుగుతాయని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ‘మీరు ధర్నా కోసం మరేవయినా ప్రదేశాలను చూసుకోవచ్చు. అయితే భగవంతుడి కోసం మీరు మీ విధిని నిర్వహించండి. మీరు ఉన్నది సభ కార్యకలాపాలలో పాల్గొనడానికి. మీ సమయాన్ని వెచ్చించి సభ్యులుగా మీకున్న అధికారాలను, హక్కులను ఉపయోగించుకోండి. ప్రత్యేకించి లోక్‌సభ సభ్యులు డబ్బు, ఆర్థిక వ్యవహారాలపై చర్చించాలి’ అని రాష్టప్రతి హితవు పలికారు. తాను ఏ ఒక్క పార్టీనో, ఏ ఒక్క వ్యక్తినో ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ‘అంతరాయం కలిగించడం అనేది ఒక ఆనవాయితీగా మారిందనేది వాస్తవం. కాని, ఇది ఆమోదనీయం కాదు. భేదాభిప్రాయాలు ఏమున్నా మనసులో ఉన్నదాన్ని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం మనకు ఉన్నది. సభలో సభ్యులు ఏం మాట్లాడినా కోర్టులు జోక్యం చేసుకోజాలవు’ అని రాష్టప్రతి అన్నారు. ఒక సభ్యుడు మరో సభ్యుడిపై ఆరోపణ చేసినా ఏ కోర్టు కూడా అతడిని ప్రాసిక్యూట్ చేయజాలదని, ఎందుకంటే అతను సభలో ఆరోపణ చేశాడు కాబట్టని ఆయన వివరించారు. ‘ఇలాంటి స్వేచ్ఛను అంతరాయం కలిగించడం ద్వారా దుర్వినియోగం చేయకూడదు’ అని ప్రణబ్ ముఖర్జీ హితవు పలికారు.
ప్రజాస్వామ్యంలో మూడు ‘డి’లు ముఖ్యమని రాష్టప్రతి అన్నారు. వాటిని డిబేట్ (చర్చ), డిసెన్షన్ (్భదాభిప్రాయాలు), డెసిషన్ (నిర్ణయం)గా ఆయన వివరించారు. నాలుగో ‘డి’ అంటే డిస్రప్షన్ (అంతరాయం) అనేది లేదని, ఈ నాలుగో ‘డి’ గురించి తన ఉపాధ్యాయుడు కూడా తనకు చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు సెషన్‌లలో మూడింట రెండు వంతుల సమయం డబ్బు, ఆర్థిక పరమైన అంశాలకే వెచ్చించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా లోక్‌సభ ఆమోదం లేకుండా ఏ ఒక్క పన్ను విధించడానికి వీలు లేదని, సంఘటిత నిధి నుంచి నగదు ఉపసంహరించడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఏటా రూ. 16 లక్షల కోట్ల నుంచి 18 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నా ఈ అంశాలపై చర్చ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో వీటిపై సరిగా చర్చించకపోవడం వల్ల తనిఖీలాంటిది లేకుండా పోయిందన్నారు. అందువల్ల మన పార్లమెంటరీ వ్యవస్థ సమర్థవంతంగా, విజయవంతంగా పనిచేస్తున్నట్టు తనకు కనిపించడం లేదన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి
చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఇదివరకే ఆమోదించిందని పేర్కొంటూ, లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నందున వెంటనే ఆమోదించాలని రాష్టప్రతి సూచించారు. ఎన్నికల సంస్కరణలపై తీవ్రంగా, విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అనేది చాలా వివాదాస్పదమైన అంశమే కాకుండా, ప్రస్తుత రాజ్యాంగ చట్రంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ చాలా కష్టమని ఆయన అన్నారు. అయితే మాటిమాటికి ఎన్నికల వల్ల పడుతున్న మోయలేని ఆర్థిక భారాన్ని నివారించడానికి సాధ్యమైతే ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి మార్గాలను అనే్వషించాలని ఆయన సూచించారు.