జాతీయ వార్తలు

ఓం పురి ఇక లేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: సమాంతర సినిమాకు చిరునామా భాసిల్లి వెండితెరపై ఎన్నో వైవిధ్యభరిత పాత్రలకు ప్రాణం పోసి, సత్తా ఉంటే ఎవరైనా హీరో కావచ్చునని రుజువుచేసిన విలక్షణ నటుడు ఓం పురి (66)ఇక లేరు. శుక్రవారం తెల్లవారు జామున తీవ్ర గుండెపోటు రావడంతో నిద్రలోనే ఆయన తుది శ్వాస విడిచారు. భారతీయ సినిమా రంగానికి వనె్న తెచ్చిన అర్ధ సత్య, ఆక్రోశ్, సిటీ ఆఫ్ జాయ్ వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో నటించి నటనలో కొత్త ఒరవడి సృష్టించిన ఓం పురి ఆకస్మిక మరణంతో వెండితెర దుఃఖసాగరంలో మునిగిపోయిం ది. ఓం పురి నటనా వైదుష్యం కేవలం హిందీ సినిమాకే పరిమితం కాలేదు. తెలుగు, హాలీవుడ్, ఎన్నో యూరోపియన్ చిత్రాల్లోనూ ఆయన నటించి విశ్వవిఖ్యాతి గాంచారు. తెలుగులో అంకురం సినిమా ఆయన నట విశ్వరూపానికి అద్దం పట్టింది. సమాంతర సినిమా నటుడిగానే ముద్ర పడినప్పటికీ ఎన్నో కమ్మర్షియల్ చిత్రాల్లోనూ తనదైన శైలిలో భిన్నభూమికల్ని పోషించి ప్రతి ఒక్కరినీ ఆయన మెప్పించారు. హర్యానాలోని అంబాలాలో జన్మించిన ఓం పురి 1976లో ‘ఘషిరామ్ కొత్వాల్’అనే మరాఠీ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు. ఒరవడికి భిన్నంగా వెళ్లడంలోనే సానపడుతుందని నమ్మిన ఓం పురి ఆ దిశగానే తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ పథంలో పుట్టుకొచ్చినవే..జానే భీ దోయార్, మిర్చి మసాలా, ధరావి, గుప్త్, ధూప్ వంటి సినిమాలు. హీరో అంటే అందంగా ఉండాలన్న భావనకు తెరదించి నటనే నటుడికి రాణింపు, గుర్తింపు అన్న వాస్తవాన్ని తన విజయపరంపర ద్వారా ఓం పురి చాటి చెప్పారు. నటుడంటే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలగాలని నిరూపించిన ఓం పురి అందుకు తగ్గట్టుగానే ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయారు. హాస్యమైనా, సాఫ్ట్‌విలనీ అయినా,సామాజిక దౌష్ట్యాలను ప్రతిఘటించే పాత్రైనా ఓం పురి కొట్టిన పిండి. ఆయన సృష్టించిన ఒరవడిలోనే ఎందలో స్టార్‌లు పుట్టుకొచ్చారు. బజరంగి భాయ్‌జాన్, ఘాయల్ వన్స్ అగైన్ వంటి ఇటీవలి చిత్రాల్లోనూ ఓం పురి కనిపించి మెప్పించారు. హండ్రెట్ ఫూజ్ జర్నీ, గాంధీ, సిటి ఆఫ్ జాయ్, ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్, చార్లీ విల్సన్స్‌వార్, ఈస్ట్ ఈజ్ ఈస్ట్ వంటి అంతర్జాతీయ చిత్రాల్లోనూ ఓం పురి నట విశ్వరూపం చూపించారు. భారత్:ఏక్ ఖోజ్, తమస్, యాత్ర, మిస్టర్ యోగి, కాకాజీ కహీ, రిష్తే, ఆహత్, వైట్ టీత్ సీరియల్స్‌లో నటించి ప్రతి ఒక్కరినీ అలరించారు. భారత చలన చిత్ర, టెలివిజన్ సంస్థలో నటనలో శిక్షణ పొందిన ఓం పురి 1973లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో పట్టా తీసుకున్నారు. అక్కడే ఓం పురితో కలిసి మరో బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా శిక్షణ పొందారు. ఓం పురి నటనకు గీటురాళ్లు ఆయనకు లభించిన అవార్డులే. ఆరోహణ్, అర్ధ సత్య చిత్రాలకు గాను రెండు సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.

సినీ, నాటక రంగాలకు ఎనలేని సేవచేసిన నటుడు:మోదీ

ఓం పురి ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయే అసాధారణ ప్రతిభ కలిగిన నటుడు:అమితాబ్
***
మమ్మల్ని ఇంత తొందరగా వదిలి వెళతారని అనుకోలేదు. మీతో కలిసి నటించిన మధుర క్షణాలు కళ్లల్లో మెదులుతున్నాయి:షబానా ఆజ్మీ
***
ఈ వార్త విన్న తర్వాత నాకు మాటలు రావడం లేదు:శ్యామ్ బెనెగల్
***
ఆ దేవుడు చాలా గొప్పవాడు. ఉత్తములనే ఆయన ముందు తీసుకుపోతాడు:షారుఖ్
***
సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.నటనను వరంగా అందిపుచ్చుకున్న ప్రతిభాశాలి: సోనియా గాంధీ
***

తుది వీడ్కోలు

శుక్రవారం సాయంత్రం ఆరున్నరకు ఓం పురి మృత దేహానికి అంత్య క్రియలు జరిగాయి. ఇక్కడి ఓషివార శ్మశానవాటికలో ఆయన కుమారుడు ఇషాన్ వీటిని నిర్వహించారు. ఆరు గంటలకు అంబులెన్స్‌లో ఓం పురి భౌతిక కాయాన్ని ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకొచ్చారు. దారిపొడవునా బారులు తీరిన జనం ఆయన తుది వీడ్కోలు పలికారు. అమితాబ్, శశికపూర్, జావెత్ అఖ్తర్, గుల్జార్, శక్తికపూర్, కేతన్ మెహతా, నావాజుద్దీన్ సిద్ధికి తదితరులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

***

‘ఓం పురి మరణించారన్న వాస్తవం నుంతి తేరుకోరుకోలేక పోతున్నాను. నమ్మశక్యం కావడం లేదు’అని ఆయన మాజీ భార్య నందిత కన్నీటి పర్యంతమయ్యారు. సమాంతర సినిమాకే కాదు సరికొత్త సినీ కధా కెరటాలకు నాంది పలికిన ఓం పురి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటీనటులు, రాజకీయ ప్రముఖులు, నాటకరంగానికి చెందిన ఎందరో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నాటక రంగంలో తనదైన ముద్రవేసి సినీ రంగంలోనూ అదే తరహా కొత్తదనాన్ని ప్రతిపాత్రలోనూ ఓం పురి కనబరిచారని మోదీ అన్నారు.