జాతీయ వార్తలు

ఇది దుర్మార్గ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎన్‌డిఏలో కీలక భాగస్వామ్య పక్షమైన శివసేన కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. గత పదివేల సంవత్సరాల కాలంలో అత్యంత దుర్మార్గమైన పాలన ఇదేనని పేర్కొంది.
వివేక శూన్యులతో కూడిన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులు నోట్ల రద్దు చర్య మహిళలను సయితం తీవ్ర ఇక్కట్ల పాల్జేసిన తరువాత నల్ల ధనాన్ని నిర్మూలిస్తుందని భ్రమపడుతున్నారని శివసేన తీవ్రస్థాయి పదజాలంతో ధ్వజమెత్తింది. రద్దయిన పాత నోట్లను మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన ఒక మహిళ ఢిల్లీలోని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రాంతీయ కార్యాలయం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, నిస్సహాయురాలయిన, దౌర్భాగ్యురాలయిన ఓ మాతృమూర్తి దుస్థితి ‘ప్రభుత్వ ప్రాయోజిత నిర్భయ విషాద ఘటన’లా కనిపిస్తోందని శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’ తాజా సంచిక సంపాదకీయంలో మండిపడింది. ‘మీరు ఎవరివైపు ఉన్నారని (మహారాష్ట్ర) ముఖ్యమంత్రిని అడగదలచుకున్నాం. నోట్ల రద్దు వైపా? దౌర్భాగ్యస్థితిలో ఉన్న మహిళ వైపా?.. ఈ మహిళ ఇబ్బందులను ప్రభుత్వం చూడలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే, ఇలాంటి క్రూరమైన, చెవిటి పాలన గత పది వేల సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేదు’ అని శివసేన తన సంపాదకీయంలో విరుచుకుపడింది. ‘ఒక మహిళ ఢిల్లీ వీధిలో హృదయ విదారక దుస్థితిలో కూర్చొని ప్రభుత్వ చర్యను ఖండిస్తుంటే, అది ప్రభుత్వం పాల్పడిన నిర్భయ విషాద ఘటనే’ అని శివసేన పేర్కొంది. వీధుల్లో మహిళలు పడుతున్న కష్టాలను, వారి ఆగ్రహాన్ని ఈ బాధితురాలు ముందుకు తెచ్చిందని పేర్కొంది. ‘ఈ మహిళ చర్యను మీరు జాతీయవాదంగా అభివర్ణిస్తే, మీ మెదళ్లకు చికిత్స చేయడానికి ఒక తాలిబన్ డాక్టర్ అవసరం ఉంటుంది. ఎందుకంటే మహిళలపై ఇలాంటి అత్యాచారాలు తాలిబన్ల పాలనలోనే జరుగుతాయి’ అని శివసేన పేర్కొంది.