జాతీయ వార్తలు

కాంగ్రెస్ ‘ఉచిత’ హామీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: పంజాబ్‌లో దశాబ్దంపాటు అధికారానికి దూరమై తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కుప్పలుతెప్పలుగా హామీలు గుప్పించింది. పంజాబ్ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సోమవారం విడుదల చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రుణమాఫీతో పాటు ఉచితంగా విద్యుత్, స్మార్ట్ఫోన్లు అందజేస్తామని వెల్లడించారు. నిరుద్యోగులకూ భారీగా ఉద్యోగాల హామీలిచ్చేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ గత పదేళ్లలో అకాలీ-బిజెపి ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పంజాబ్ రాష్ట్రానికి కెప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వం చాలా అవసరమని ఆయన తెలిపారు. ‘పంజాబ్ ప్రజలకు మంచి రోజులు తీసుకురావలసిన అవసరం ఉంది. ఈ మేనిఫెస్టో ఒక విజనరీ డాక్యుమెంట్ లాంటిది. గత పదేళ్లలో దారుణంగా దెబ్బతిన్న పంజాబ్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటానికి ఇది దారి చూపుతోంది’ అని మన్మోహన్ వివరించారు. పంజాబ్ అభివృద్ధి పట్ల అమరీందర్ నిబద్ధతతో ఉన్నారని అన్నారు. అకాలీల నేతృత్వంలో పంజాబ్ ఉగ్రవాదానికి బలైపోయిందన్నారు. రాష్ట్రంలో సంపద పంపిణీ సక్రమంగా జరిగేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా ఉండేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్‌తోపాటు నిరుద్యోగులకు నెలకు రూ.2500 రూపాయల భత్యం, పిల్లలకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, అయిదేళ్లలో 25లక్షల ఉద్యోగాల కల్పన వంటివి ఉన్నాయి. రాష్ట్రంలో డ్రగ్ మాఫియాను, అవినీతిని నిర్మూలిస్తామని కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దళితులు, ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసిలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, కుటుంబానికో ఉద్యోగం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ హామీల వరద పారించింది.