జాతీయ వార్తలు

స్తంభించిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పాత పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన టిఎంసిపై కక్ష సాధింపు చేస్తోందంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం లోక్‌సభను స్తంభింపజేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు మాత్రం శాంతించకుండా పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. కొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో లోక్‌సభ దద్దరిల్లిపోయింది. జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోకుండా గొడవ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ గొడవ, గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె ఒక ప్రశ్నను చర్చకు చేపట్టినా సభ్యులు శాంతించలేదు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్షానికి చెందిన మరికొందరు సభ్యులు ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అడ్డుతగలటంతో స్పీకర్ సమావేశం ప్రారంభమైన ఏడు నిమిషాలకే సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభ మధ్యాహ్నం పనె్నండు గంటలకు తిరిగి సమావేశం కాగానే సుమిత్రా మహాజన్ మొదట అధికార పత్రాలను సభకు సమర్పింపజేసిన అనంతరం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో రెండు బిల్లులను ప్రతిపాదింపజేశారు. ఆ తరువాత ఆమె రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభిస్తున్నందున జీరో అవర్‌ను చేపట్టటం లేదని ప్రకటించారు. దీనికి ఆగ్రహం చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని చెప్పి ఇప్పుడిలా చేయటం ఏమిటంటూ వారు ప్రశ్నలు కురిపించారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌగత్ రాయ్ మాట్లాడుతూ తానిచ్చిన వాయిదా తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. ఇంతలో కొందరు కాంగ్రెస్ సభ్యులు కూడా పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో సభ గందరగోళంలో పడిపోయింది. ఎన్‌డిఏ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే తమ ఎంపీని అరెస్టు చేశారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీనితో సభ పూర్తిగా అదుపుతప్పటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.

చిత్రాలు..సభలో మాట్లాడుతున్న స్పీకర్ సుమిత్రా మహాజన్
*తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు శుక్రవారం లోక్‌సభను స్తంభింపజేస్తున్న దృశ్యం