జాతీయ వార్తలు

క్షేమంగా తిరిగొచ్చిన మత గురువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: పాకిస్తాన్‌లో ఇటీవల అదృశ్యమైన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా ప్రధాన మత గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామి, అతని మేనల్లుడు, సూఫీ మత గురువు నజీం అలీ నిజామి సోమవారం ఇక్కడికి క్షేమంగా తిరిగి వచ్చారు. అయితే వారు తాము ఎలా అదృశ్యమైందీ, ఎలా బయటపడిందనే వివరాలను వెల్లడించలేదు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ విమానయాన సంస్థకు చెందిన విమానంలో ఇక్కడికి చేరుకున్న వారిద్దరు అనంతరం విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. వీరిద్దరి అదృశ్యం సంఘటనను సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ముస్లిం మత గురువులు తమ కష్టాలను క్లుప్తంగానే తెలిపినప్పటికీ, వారిద్దరికి భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌తో సంబంధాలు ఉన్నాయని కరాచీ నుంచి వెలువడుతున్న ఒక ఉర్దూ దినపత్రికలో వచ్చిన వార్త ఆధారంగా వారిద్దరిని పాకిస్తాన్ నిఘా సంస్థ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఆసిఫ్ నిజామి కుమారుడు సాజిద్ నిజామి ఆరోపించారు. సింధ్ ప్రావిన్స్‌లోని మారుమూల ప్రాంతంలో కమ్యూనికేషన్ నెట్‌వర్క్ లేనందున తమను తమ వాళ్లు సంప్రదించ లేకపోయారన్న వార్తలను నజీం అలీ నిజామి తోసిపుచ్చారు. ‘సింధ్ ప్రావిన్స్‌లోకి వెళ్లడానికి మాకు వీసానే లేదు. అలాంటప్పుడు మేము అక్కడికి ఎలా వెళ్తాం?’ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ వారిని అదుపులోకి తీసుకుందని సాజిద్ చెప్పారు. స్వరాజ్‌తో భేటీ తరువాత, తాము సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేసిన భారత ప్రభుత్వానికి, ప్రత్యేకించి విదేశాంగ మంత్రికి నజీం అలీ నిజామి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ అయన మత గురువులు సయ్యద్ ఆసిఫ్ నిజామి, నజీం అలీ నిజామి