జాతీయ వార్తలు

అభియోగాలు కట్టుకథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌పై చేసిన ఆరోపణలన్నీ కట్టుకథలంటూ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన్ని గూఢచారిగా పేర్కొంటూ విధించిన ఉరి శిక్షను అమలు చేస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలూ మంగళవారం దద్దరిల్లిన నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు. జాదవ్‌ను ఉరితీస్తే దాని ప్రభావం ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చాలా తీవ్ర ప్రభావానే్న కనబరుస్తుందని తెగేసి చెప్పారు. జాదవ్ తప్పుచేసినట్టుగా ఎలాంటి ఆధారాలూ లేవని, తాను పన్నిన కుట్రకు పాక్ ఆయన్ని బలిచేస్తోందని ఉభయ సభల్లో చేసిన ప్రకటనలో స్వరాజ్ ఎదురుదాడి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జాదవ్‌పై విధించిన మరణ శిక్షను అమలు చేస్తే అది ఓ కుట్ర ప్రకారం జరుగుతున్న హత్యగానే తాము భావించాల్సి ఉంటుందని పాక్‌కు తెగేసి చెప్పారు. జాదవ్‌కు ఎలాంటి చట్ట, న్యాయపరమైన అవకాశాల్ని కల్పించకుండా పాకిస్తాన్ సైనిక కోర్టు అంతర్జాతీయ నియమాలకు విరుద్ధంగా ఈ శిక్ష ఖరారు చేసిందన్నారు. దీన్ని ఓ అమాయకుడ్ని, నిరపరాధిని తన కుత్సితాలకు పాక్ బలిచేయడంగానే భారత ప్రభుత్వం, ప్రజలు భావించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశంపై ముందుకెళ్లే ముందు దీని వల్ల ఉభయ దేశాల సంబంధాలపై పడే ప్రభావంపై దృష్టి పెట్టాలని, విజ్ఞతాయుతంగా వ్యవహరించాలని పాకిస్తాన్‌ను హెచ్చరిస్తున్నానని సుష్మా స్వరాజ్ చెప్పారు. కిడ్నాప్‌కు గురైన ఓ అమాయక భారతీయుడ్ని బలిచేయడానికి పాకిస్తాన్ ఎంత హాస్యాస్పద రీతిలో విచారణ జరిపిందో జాదవ్ కేసు స్పష్టం చేస్తోందన్నారు. అవకాశం ఇస్తే జాదవ్‌కు అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదుల సహాయాన్ని అందిస్తామని, పాకిస్తాన్ సుప్రీం కోర్టులో వాదిస్తామనీ తెలిపారు. అవసరమైతే పాకిస్తాన్ అధ్యక్షుడ్ని కూడా ఈ అంశంపై సంప్రదిస్తామని
తెలిపారు. ‘జాదవ్ ఓ తల్లికి పుట్టిన బిడ్డే కాదు భారత మాత ముద్దుబిడ్డ కూడా..అలాంటి వ్యక్తిని రక్షించేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాం’అని ఉద్ఘాటించారు. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న జాదవ్‌ను కిడ్నాప్ చేసి పాకిస్తాన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. అయితే అందుకు దారితీసిన పరిణామాల గురించి పూర్తి సమాచారం లేదని, జాదవ్‌కు దౌత్య పరమైన సేవల్ని అందుబాటులోకి తెస్తే అసలు జరిగిందేమిటో బయటికి వస్తుందని చెప్పారు.