జాతీయ వార్తలు

బిజెపి వ్యతిరేక పార్టీలతో కలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 14: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల టాంపరింగ్‌పై మాట్లాడుతున్నందుకే బిజెపి తనను టార్గెట్ చేస్తోందని బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ఇవిఎంల టాంపరింగ్ అంశంపై బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏ పార్టీతోనైనా చేతులు కలపడానికి తాను సిద్ధమేనని కూడా ఆమె ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఇవిఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిందని మాయావతి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలాంటి ప్రతిపక్షాలు సైతం ఇదే ఆరోపణలు చేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా శుక్రవారం తమ పార్టీ ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో మాయావతి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడడంలో పార్టీల సాయం తీసుకునే విషయంలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, బిజెపిని వ్యతిరేకించే ఏ పార్టీ సాయమైనా తీసుకుంటామని ఆమె చెప్తూ, ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం ముఖ్యమన్నారు. ‘2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఇవిఎంలను టాంపరింగ్ చేయడం వల్లనే అధికారంలోకి వచ్చింది.. అయితే ఇటీవలి ఎన్నికల్లో మాత్రమే మేము ఈ విషయాన్ని గ్రహించా’మని మాయావతి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని 403 స్థానాల్లో 250 సీట్లలో ఇవిఎంలను టాంపరింగ్ చేశారని, మిగతా స్థానాల్లో తాము సునాయాసంగా గెలుస్తామని వారు అనుకున్నారని ఆమె అన్నారు.
కాగా, ఈ సందర్భంగా మాయావతి తన సోదరుడు ఆనంద్‌కుమార్‌ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఎంపి, ఎమ్మెల్యే లేదా ముఖ్యమంత్రి కాబోరన్న షరతుమీదనే ఆయనకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినట్లు కూడా ఆమె చెప్పారు. ఆనంద్‌కుమార్ ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ నిఘాలో ఉన్న విషయం తెలిసిందే. మాయావతి యుపి ముఖ్యమంత్రిగా ఉన్న ఏడేళ్ల కాలంలో ఆనంద్‌కుమార్ భారీ ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి.
ఈ సమావేశంలో మాయావతి తొలిసారిగా తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడారు. తన గొంతులోని ఒక గ్రంథిని 1996లో ఆపరేషన్ చేసి తొలగించినందునే తాను రాసిన స్పీచ్‌ని చదవాల్సి వస్తోందని ఆమె చెప్పారు. మరీ గట్టిగా మాట్లాడవద్దని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు చెప్పారు. మాయావతి హయాంలో చక్కెర మిల్లుల అమ్మకం స్మారక కట్టడాల నిర్మాణంపై యుపి కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే చక్కెర మిల్లుల అమ్మకంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని మాయావతి చెప్పారు. ఇవిఎంలపై మాట్లాడకుండా ఉండడానికే తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు.