జాతీయ వార్తలు

వినోద్‌ఖన్నా కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఏప్రిల్ 27: ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్‌ఖన్నా (70) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబయిలోని రిలయన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 11.20కు తుదిశ్వాస విడిచారు. వినోద్ మృతిపట్ల భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది.
వినోద్‌ఖన్నా బాలీవుడ్‌లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. 1968లో వచ్చిన ‘మన్ కా మీత్’ చిత్రంతో హిందీ తెరకు పరిచయమైన ఆయన, తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. దాదాపు 140కి పైగా చిత్రాల్లో నటించిన వినోద్‌ఖన్నాకు ‘మేరే గావ్ మేరే దేశ్’, ‘గద్దార్’ (1973), ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘రాజ్‌పుట్’, ‘ఖుర్బానీ’ (1980), ‘దయావన్’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. 2015 వరకూ ఆయన నటుడిగా కొనసాగారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘దిల్ వాలే’. వినోద్‌ఖన్నా మొదట్లో ప్రతినాయక పాత్రలతో ఆకట్టుకుని, తరువాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1946 అక్టోబర్ 6న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో వినోద్‌ఖన్నా జన్మించారు. భారత్- పాక్‌లు విడిపోవడంతో ఆయన కుటుంబం ముంబయికి మకాం మార్చింది. సినిమాలమీది ఆసక్తితో ప్రయత్నాలు చేసిన ఆయనకు సునీల్‌దత్ నిర్మించిన ‘మన్ కా మీత్’ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి అవకాశం దొరికింది. ఆ చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వినోద్‌కు, తరువాత పూరబ్ ఔర్ పశ్చిమ్, ఆ మిలో సజనా, మస్తానా, ఎలాన్‌వంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలతో తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. 1971లో వచ్చిన ‘హమ్ తుమ్ ఔర్ ఓ’ సినిమాతో హీరోగా మారి హత్యారా, ఖుర్బానీ, గద్దార్ వంటి చిత్రాలతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. హీరోగా సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగుతున్న సమయంలోనే ఆకస్మికంగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు ఐదేళ్లపాటు ఆయన ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆధ్యాత్మిక భావనలతోనే సినిమాలకు దూరమయ్యానని వినోద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తిరిగి 1987లో ‘ఇన్సాఫ్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 140కిపైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన వినోద్‌ను ఎన్నో అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. తరువాత ‘మేరే అప్నే’ అనే హిందీ సీరియల్‌లో నటించి టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 1971లో గీతాంజలితో వినోద్‌ఖన్నాకు వివాహం జరిగింది. వీరికి రాహుల్‌ఖన్నా, అక్షయ్‌ఖన్నా ఇద్దరు కుమారులు. కొన్నాళ్లకు గీతాంజలితో విడిపోయి 1990లో కవితను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె. సినిమాల్లోనేకాక రాజకీయంగానూ వినోద్‌ఖన్నా తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆయన గురుదాస్‌పూర్ ఎంపీగా వ్యవహరించారు. భిన్నమైన పాత్రలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకున్న వినోద్‌ఖన్నా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తరువాత ఆస్పత్రిలో చేర్పించిన ఆయనకు క్యాన్సర్ అని తేలింది. కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్న వినోద్‌ఖన్నా గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో భారతీయ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. సాయం త్రం అం త్యక్రియలు జరిగాయ. ఈ అంత్య క్రియలకు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యారు.