జాతీయ వార్తలు

వర్తకులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11:చిన్న వ్యాపారస్తులకు ఊరట కలిగించడంతో పాటు వినియోగదారులకూ ఉపశమనాన్ని అందించే రీతిలో మరో 66 దైనందిన వినియోగ వస్తువులపై జిఎస్‌టి పన్ను తగ్గింది. మరో మూడువారాల్లో ఒకే దేశం ఒకే పన్ను అన్న చారిత్రక నినాదంతో ముందుకెళ్లనున్న కేంద్రం క్రమానుగంగా వ్యాపారస్తుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ అమలు మార్గాన్ని సుగమం చేసుకుంటోంది. ఆదివారం ఇక్కడ సమావేశమైన జిఎస్‌టి మండలి మొత్తం 133 వస్తువులపై పన్నులు తగ్గించాలన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ 66వస్తువులకే ఈ వెసులుబాటు కల్పించింది. వీటిలో అగరబత్తిలు, జీడిపప్పు, పిల్లల పుస్తకాలు, పచ్చళ్లు మొదలైనవి ఉన్నాయి. ఇప్పటికే 1200 వస్తువులను 5,12,18,28 పన్నుల శ్లాబుల్లో చేర్చినప్పటికీ కొన్ని వస్తువులు, సేవలకు సంబంధించి పన్నుల భారం భారీగానే ఉందన్న విమర్శలు తలెత్తడంతో జిఎస్‌టి మండలి తన పదహారో సమావేశంలో వీటిని పరిశీలించింది. అయితే వీటిలో కేవలం 66 వస్తువులకు సంబంధించిన డిమాండ్లనే పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా పన్ను రేట్లను తగ్గించింది. ఈ వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి జైట్లీ వ్యాపారస్తులకు టర్నోవర్ పరిమితిని 50లక్షల నుంచి 75లక్షలకు పెంచామని, వర్తకులు ఇందుకు సంబంధించిన మిశ్రమ పథకం ప్రకారం 1,2,5శాతం శ్లాబుల్లో పన్ను చెల్లించవచ్చునని అన్నారు. రెవిన్యూ సమతూకాన్ని సాధించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ముఖ్యంగా దీని వల్ల చిన్న వర్తకులు, రెస్టారెంట్లు తదితర సంస్థలపై భారం తగ్గుతుందని వెల్లడించారు. ఎస్‌ఎమ్‌ఇలు, చిన్న వర్తకులు, రెస్టారెంట్లే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి కాబట్టి వీటి ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
సవరించిన పన్నుల ప్రకారం 100 రూపాయల వరకూ ఉండే సినిమా టికెట్‌పై 28శాతం నుంచి 18శాతానికి పన్ను తగ్గుతుంది. వంద రూపాయలు దాటే టికెట్‌పై గతంలో నిర్ణయించిన 28శాతం జిఎస్‌టినే అమలు అవుతుంది. ఫలాలు, కూరగాయలు, పచ్చళ్లు, కెచప్‌లు, చట్నీలు తదితర వినియోగ పదార్ధాలపై 18శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గుతుంది. జీడిపప్పు, ఇన్సులిన్, అగరబత్తిలపై జిఎస్‌టిని 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది. కంప్యూటర్ ప్రింటర్లు, స్కూలు బ్యాగులపై ఈ పన్ను భారీగానే 28శాతం నుంచి 18శాతానికి తగ్గింది. పిల్లల బొమ్మలు, డ్రాయింగ్ పుస్తకాలను ఇంతకు ముందు విధించిన పనె్నండు శాతం పన్ను నుంచి మినహాయించారు. ట్రాక్టర్ భాగాలు, ప్లాస్టిక్ బీడ్లు, టార్పలిన్‌లపై కూడా పన్నును 18శాతానికి తగ్గించారు. జౌళి, డైమండ్ ప్రొసెసింగ్, తోలు, బంగారం, ప్రింటింగ్ వంటి జాబ్ వర్క్‌లపై పన్నును 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల జాబ్ వర్క్‌లను ఔట్‌సోర్స్ చేసేందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుందని జైట్లీ వెల్లడించారు. ప్రస్తుత పన్ను రేట్లకు సహేతుకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ 66వస్తువుల పన్ను రేట్లలో మార్పులు చేశామని తెలిపారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న జిఎస్‌టికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలపైనా చర్చలు పూర్తి చేశామన్నారు. ‘జిఎస్‌టి అమలుకు మేము సిద్ధంగా లేము. అది ఎప్పుడు అమలు అయినా మాకు సంబంధం లేదు’అని కొందరు అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసిన జైట్లీ ‘ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదు. జిఎస్‌టి అమలుకు అందరూ సిద్ధం కావాల్సిందే’నని ఉద్ఘాటించారు. ఇంకొన్ని వస్తువులపై పన్ను రేట్లు సవరించేందుకు అవకాశం ఉందా అన్న ఓ ప్రశ్నకు ‘జిఎస్‌టి మండలి, ఫిట్‌మెంట్ కమిటీ అన్ని వర్గాల డిమాండ్లను లోతుగా పరిశీలించే నిర్ణయం తీసుకున్నాయి. దాదాపుగా ఇవే తుది రేట్లు’అని జైట్లీ జవాబిచ్చారు.

‘అన్ని వర్గాల డిమాండ్లు పరిశీలించాం. వాస్తవిక దృష్టితోనే రేట్లు తగ్గించాం. దాదాపుగా ఇవే తుది రేట్లు. జిఎస్‌టికి సిద్ధం కావాల్సిందే’
- జైట్లీ