జాతీయ వార్తలు

మాఫీ భారం మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: రైతుల రుణాలు మాఫీ చేయటం వలన కలిగే భారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించవలసి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. పంట రుణాలు మాఫీ చేసే రాష్ట్రాలకు కేంద్రంనుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందదని సోమవారం మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వనరుల ఆధారంగానే రైతుల రుణాలు మాఫీ చేయాలని సూచించారు. అరుణ్‌జైట్లీ సోమవారం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల అధిపతులతో సమావేశమై ఎగవేతకు గురైన రుణాల గురించి సంప్రదింపులు జరిపారు. రైతుల పంట రుణాలు మాఫీ చేసే రాష్ట్రాలు తమ వనరుల నుండి ఈ భారాన్ని భరించాలని తాను ఇది వరకే స్పష్టం చేశానని జైట్లీ ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం పంట రుణాలను మాఫీ చేసిన నేపథ్యంలో జైట్లీ ఈ ప్రకటన చేయటం గమనార్హం. మధ్యప్రదేశ్ రైతులు కూడా పంట రుణాలను మాఫీ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, ఈ ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో దాదాపు 8మంది రైతులు మరణించటం తెలిసిందే. ఎంపీ సిఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ కూడా పంట రుణాలు మాఫీ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కొత్త సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా దాదాపు 35 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దశలవారీగా అమలు చేస్తోంది. ముగ్గురు బిజెపి సిఎంలు రైతుల పంట రుణాలను మాఫీ చేయటం, లేదా చేస్తున్న తరుణంలో జైట్లీ ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆయా రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు మాఫీ చేసిన పంట రుణాలకే అర్థిక సహాయం చేయనప్పుడు ఇతర రాష్ట్రాలు పంట రుణాలను మాఫీ చేసినప్పుడు ఎలా ఆదుకుంటామనే సందేశం పంపించేందుకే ఆయన ఈరోజు ప్రకటన చేశారనే మాట వినిపిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించక తల్లడిల్లిపోతున్నారు. తమిళనాడు రైతులు తమను ఆదుకోవాలంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దాదాపు నెల పాటు నిరవధిక ధర్నా చేయటంతోపాటు పలు రకాలుగా నిరసన తెలిపారు. తమిళనాడు రైతులు చివరకు నగ్న ప్రదర్శన చేసి ప్రపంచానికి తమ బాధలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. కొన్ని రాష్ట్రాల్లో పంటలకు గిట్టుబాటు ధర లభించక సర్వం కోల్పోయిన రైతులు ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంట రుణాల మాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందదని ప్రకటించటం వివాదాస్పదంగా మారింది.

చిత్రం.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ