జాతీయ వార్తలు

మీ వెంటే మేముంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: చైనాతో ఏర్పడిన సరిహద్దు వివాదంలో ఆచితూచి అడుగేయాలని అఖిలపక్ష పార్టీల నేతలు ఎన్డీయే సర్కారుకు హితవు పలికారు. సిక్కిం సెక్టార్ సరిహద్దు సమస్యను వీలైనంత వరకు శాంతియుత పద్ధతిలో దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. దేశరక్షణ విషయంలో తాము ప్రభుత్వానికి అండగా ఉంటామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకూ తమ మద్దతుంటుదని హామీ ఇవ్వటం ద్వారా సమైక్యతను ప్రకటించారు. సరిహద్దు వివాదంపై విపక్షాల సీనియర్లు పలు అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ అడిగారు. సిక్కం సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య గత ఐదు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం అఖిలపక్షం ముందుంచిన తరువాతే ఈ సూచన చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం సాయంత్రం అఖిలపక్ష పార్టీల అగ్ర నేతలతో సమావేశమై డొక్లామ్ స్థితిగతులను వివరించారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన సమావేశంలో మొత్తం పరిస్థితిపై కూలంకష చర్చ జరిగినట్టు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజులముందు సమావేశం జరగటం ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రతిపక్షం సిక్కిం సెక్టార్‌లో నెలకొన్న పరిస్థితులపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్న సమయంలో ఈ సమావేశం జరగటం గమనార్హం. సిక్కిం సెక్టార్‌లో భారత, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొనేందుకు దారి తీసిన పరిస్థితులను వివరించటంతోపాటు ప్రభుత్వం సైనికపరంగా తీసుకుంటున్న చర్యలను అఖిలపక్షానికి వివరించారు. భూటాన్‌కు చెందిన భూభాగంలో రోడ్డును నిర్మించటం ద్వారా చైనా ‘స్టేటస్ కో’ను మార్చేందుకు చేస్తోన్న ప్రయత్నం, దీన్ని అడ్డుకునేందుకు భారత బలగాలు చేస్తున్న ప్రయత్నం తదితర వివరాలను ప్రభుత్వం ప్రతిపక్షాల ముందుంచింది. చైనా సైనిక పరమైన చర్యకు దిగితే ఎలాంటి పరిణామలు ఎదురవుతాయి, రెండు సైన్యాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగి పరిస్థితి యుద్ధానికి దారి తీస్తుందా? అలాంటి పరిస్థితి తలెత్తితే భారత సైన్యం ఏర్పాట్లు ఏమిటి? అనేది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. భారత సైనికులు మొదటిసారి చైనా ఆధీనంలో ఉన్న భూటాన్ ప్రాంతంలోకి వెళ్లి చైనా సైనికులు రోడ్డు నిర్మించకుండా అడ్డుకోవటం తెలిసిందే. సిక్కిం సెక్టార్ ఉద్రిక్తతను తగ్గించేందుకు, సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు దౌత్యమార్గాల ద్వారా విదేశాంగ శాఖ చేస్తున్న ప్రయత్నాలను సుష్మాస్వరాజ్ వివరించగా, సైనికపరమైన అంశాలను అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలకు వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ శాంతి భద్రతల పరిస్థితిని వివరించటంతోపాటు అమర్‌నాథ్ యాత్రికులపై లష్కరే తోయిబా ఇటీవల జరిపిన దాడి, దీనికి సంబంధించిన పూర్వపరాలను రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాలకు వివరించారు. ప్రభుత్వం నుండి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్‌తోపాటు జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. లోక్‌సభలో ప్రతిపక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఎల్‌జెపి అధినేత రాంవిలాస్ పాశ్వాన్, ఎన్‌సిపి నాయకుడు తారిక్ అన్వర్, జెడి (యు) అధినాయకుడు శరద్ యాదవ్, కెసి త్యాగి, తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ నాయకుడు డెరిక్ ఒబ్రేన్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు, లోక్‌సభలో పార్టీపక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, లోక్‌సభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
పూర్తి మద్దతు
దేశ రక్షణ విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని లోక్‌సభలో టిడిపి పక్షం నాయకుడు తోట నరసింహం చెప్పారు. నరసింహం సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సిక్కిం సెక్టార్ వ్యవహారంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్నారు. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా ఖండించారు.
ఆచితూచి అడుగులు
సరిహద్దు సమస్యను శాంతియుత పద్ధతిలో దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించాలని తెరాస నేతలు కేశవరావు, జితేందర్ రెడ్డి, వైకాపా నేత రాజ్‌మోహన్ రెడ్డి కేంద్రానికి సూచించారు. దేశ రక్షణ విషయంలో తాము ఎన్డీయే వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు.

చిత్రం.. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్