జాతీయ వార్తలు

అడ్డూఅదుపులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారతదేశంలో నేరాల రేటు దిగ్భ్రాంతికరంగా ఉందని, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్‌లు బెంబేలెత్తిస్తున్నాయని ఆర్థిక సర్వే శుక్రవారం స్పష్టం చేసింది. దేశ జనాభాలో 50 శాతం వరకు ఉన్న మహిళల సాధికారికతకు అనేక అవరోధాలు ఉన్నాయని కూడా పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నివేదిక స్పష్టం చేసింది. దాడులు, కిడ్నాప్‌లు తీవ్రం కావడం వల్ల బయటికి రావాలంటేనే మహిళలు భయపడే పరిస్థితి తలెత్తిందని ఈ నివేదిక తెలిపింది. ఈ పరిస్థితి మెరుగు కావాలంటే న్యాయ వ్యవస్థ క్రియాశీలకం కావాలని, మహిళల హక్కులకు సంబంధించిన అంశాలపై సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించింది. కేవలం ప్రత్యేక కోర్టులు, ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేసినంత మాత్రాన మహిళల అభద్రతా భావం తొలగిపోయే అవకాశం లేదని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుని సత్వర న్యాయం జరిగేలా చూసినప్పుడే మహిళలకు రక్షణ, భద్రత చేకూరుతుందని, వారికి సాధికారికతను అందించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ సర్వే తెలిపింది. ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం సారథ్యంలో ఈ సర్వే రూపకల్పన జరిగింది. వివిధ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు సత్వర నిర్ణయాలు జరగాలని, ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు దాఖలైంది, తీర్పు అమలుకు ఎంతకాలం పట్టింది వంటి అనేక వౌలిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినప్పుడే పరిస్థితి గుణాత్మకంగా మారుతుందని తెలిపింది. అలాగే పలు కేసులకు సంబంధించి ఎన్ని అప్పీళ్లు దాఖలయ్యాయి, వాటిని ఖరారు చేయడానికి ఎంత సమయం పట్టింది, వీటి వ్యవహారం తుది విచారణకు రావడానికి ఎన్ని వాయిదాలు పడ్డాయన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సర్వే సూచించింది. వ్యక్తిగతంగా రాజకీయ జీవితంలో సమాన హక్కులతో మహిళలు రాణించలేకపోవడానికి కూడా అనేక కారణాలున్నాయని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఆస్తి హక్కు లేకపోవడం, వరకట్నం వంటి సామాజిక దురంతాలు ఇంకా కొనసాగడం వంటివి మహిళల సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయని, వారు ధైర్యంగా ముందుకు వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయని పేర్కొంది. వీటన్నింటిలోనూ వాస్తవానుగుణమైన మార్పులు వస్తే తప్ప మహిళలు పరిపూర్ణ స్థాయిలో ఎదిగే అవకాశం లేదని స్పష్టం చేసింది. మహిళలపై నేరాల రేటు పెరిగిపోవడం వల్ల గౌరవప్రదంగా జీవించాలన్న వారి వౌలిక హక్కులకే విఘాతం కలుగుతోందని తెలిపింది.