జాతీయ వార్తలు

అడుగడుగునా అలసత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, ఆగస్టు 12: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 20ఏళ్ల పాటు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం, శుక్రవారం మధ్య 30 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ చిన్నారుల మరణాలకు ఆస్పత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ కొరతే ప్రధాన కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆస్పత్రిలోని స్టోరేజ్ ప్లాంట్ నిర్వహణను చూస్తున్న ఉద్యోగులు లిక్విడ్ ఆక్సిజన్ ప్రమాదకరంగా అతితక్కువ స్థాయిలో ఉందని, రాత్రి దాకాకూడా రాదంటూ గురువారం ఉదయం ఆస్పత్రి చీఫ్ సూపరింటెండెంట్‌కు ఒక లేఖ రాశారు. తక్షణమే చర్యలు తీసుకొని చిన్నారులు, రోగుల ప్రాణాలను కాపాడాలని ప్లాంట్ ఆపరేటర్లు ఆ లేఖలో అధికారులను కోరారు. ఉద్యోగులు ఇలా లేఖ రాయడం వారంలో రెండోసారి. కానీ, అధికారుల్లో మాత్రం చలనం లేదు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ప్రతి ఏటా వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే మెదడు వాపు వ్యాధుల కారణంగా వందలాది మంది చిన్నారులు చనిపోతూ ఉంటారు. ఈ ఏడాది కూడా జనవరినుంచి ఈ నెల 8వ తేదీ దాకా మొత్తం 476 మంది మెదడువాపు వ్యాధి రోగులు ఇదే బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చేరారు. వీరిలో దాదాపు 117 మంది (అందరూ చిన్నారులే) చనిపోయారు. కాగా, మామూలుగా అయితే ఈ వారంలో చనిపోయిన 30 మంది చిన్నారులు కూడా ఆ జాబితాలో చేరిపోయి ఉండేవారు. అయితే ఆస్పత్రికి లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే కంపెనీకి బిల్లులు చెల్లించలేదన్న కారణంగా ఆస్పత్రిలోని ట్రామా సెంటర్, మెదడువాపు వ్యాధి వార్డులు, నవజాత శిశువులకు చెందిన ఇనె్సంటివ్ కేర్ యూనిట్‌కు గురువారం రాత్రి లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. మరణాల్లో అధిక భాగం నవజాత శిశువుల వార్డులోనే సంభవించాయి. అయితే లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు, ఈ ప్రాంతం బిజెపి ఎంపీ కమలేష్ పాశ్వాన్ చెప్తుండడం గమనార్హం. కాగా గురు, శుక్రవారాల్లో అదే వార్డుల్లో 18 మంది పెద్దవాళ్లు కూడా చనిపోయారన్న వార్త మాత్రం ఎవరి దృష్టికీ రాకపోవడం విశేషం.
నిజానికి రూ.63.65 లక్షల బకాయిలను చెల్లించకపోతే ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తామని లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే పుష్పా సేల్స్ అనే కంపెనీ హెచ్చరించినప్పటినుంచి కూడా స్థానిక మీడియా బిఆర్‌డి కాలేజీ అధికారులను హెచ్చరిస్తూనే ఉందని మనోజ్ సింగ్ అనే స్థానిక జర్నలిస్టు చెప్పారు. బకాయిలు తక్షణం చెల్లించాలంటూ కంపెనీ ఈ నెల 1న ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌కు ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌లో మాత్రం ఎలాంటి చలనం లేదు. అయితే గురువారం రాత్రి ఒక్క సారి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, కారణాలేమిటని ప్రశ్నిస్తూ స్థానిక విలేఖరులు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో జిల్లా మేజిస్ట్రేట్ రాజీవ్ రౌటాలా మీడియాతో మాట్లాడుతూ 30 మంది చిన్నారులు మృతి చెందిన విషయాన్ని చెప్తూనే ఆక్సిజన్ కొరతకు, ఈ మరణాలకు సంబంధం లేదని వాదించారు. అంతేకాదు, అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి 50 దాకా ఆక్సిజన్ సిలిండర్ల స్టాక్ ఉందని, మరో 150 సిలిండర్లను తెప్పించే ప్రయత్నం జరుగుతోందని కూడా ఆయన చెప్పడం గమనార్హం.
ముఖ్యమైన విషయం ఏమిటంటే మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను అధికారులతో సమీక్షించారు కూడా. అయితే అప్పుడు అధికారులెవరు కూడా ఈ సమస్యను సిఎం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఆస్పత్రిలో సిబ్బంది కొరత లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. డాక్టర్లు సహా చాలామంది సిబ్బందికి రెండేళ్లకు పైగా జీతాలు చెల్లించడం లేదని తెలుస్తోంది.
యుపిలో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దినెలల ముందు ప్రధాని నరేంద్ర మోదీ 1700 కోట్లతో గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెదడువాపు వ్యాధిపై పోరులో ఇది ఒక పెద్ద ముందడుగని బిజెపి చెప్పుకొంటోంది. అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్య పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని మానవ్ సేవా సంస్థాన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన రాజేష్ మణి అంటున్నారు.

చిత్రం.. *బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు