జాతీయ వార్తలు

అణువణువూ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఇటు భూతలం.. అటు గగనతలంలో రెప్పవాల్చని నిఘా. అడుగేస్తే కనిపెట్టేసే డేగకన్ను. 71వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని నగరం భద్రతా వలయంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించే ఎర్రకోట మొదలుకొని రాజధాని నగరం యావత్తూ నిఘా గుప్పిట్లోకి వచ్చింది. ఇటు స్వాతంత్య్ర దినోత్సవం, అటు కృష్ణాష్టమి ఒకే రోజు రావడంతో భద్రతా దళాలు మరింతగా అప్రమత్తమయ్యా యి. దాదాపు 70వేలమంది పోలీసులను ఇందుకోసం నియోగించారు. చారిత్రక ఎర్రకోట వద్దే 9,100మంది పోలీసులతో వలయాలుగా భద్రతను ఏర్పాటుచేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి తరలివచ్చే సీనియర్ మంత్రులు, విదేశీ ప్రముఖులు, అధికారులు, వేలాదిమంది సామాన్య ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఏమరుపాటుకు తావులేని రీతిలో నిఘాను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. శాంతియుత పరిస్థితులను భగ్నం చేసేందుకు ఉగ్రవాద మూకలు ఎలాం టి ప్రయత్నం చేసినా క్షణాల్లో వాటిని అణచివేసేందుకు వీలుగా ఎన్‌ఎస్‌జి శిక్షిత పరాక్రమ్ దళాలను సన్నద్ధంగా ఉంచినట్లు తెలిపారు. దాదాపు పదకొండు పరాక్రమ్ వ్యాన్లను ఎర్రకోట చుట్టుపక్కలే అందుబాటులో ఉంచామన్నారు. బహుముఖీయంగా భద్రతను ఏర్పాటుచేశామని, పరిసర ప్రాంతాల్లోని ఇళ్లు, అద్దెకుండేవాళ్ల వివరాలను కూడా ఇప్పటికే సేకరించామని అధికారులు తెలిపారు. దాదాపు అన్ని కీలక ప్రాంతాల్లోనూ సిసి టీవీ కెమెరాలను ఏర్పాటుచేశామని, ఈ ప్రాంతంలోకి వచ్చే ప్రతి ఒక్కరిపైనా నిఘా పెట్టామని స్పష్టం చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద ఎన్‌ఎస్‌జి ప్రత్యేక స్నైపర్ దళాలను, కమాండోలను మోహరించామని, అలాగే డ్రోన్లు, ఇతర పరికరాలతో జరిగే దాడులను నిరోధించేందుకు వీలుగా నిరోధక తుపాకులను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో అన్ని రకాల వైమానిక కార్యకలాపాలను నిషేధించామని, బెలూన్లు, పారాగ్లైడింగ్, ఇతర గగనతల కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశామన్నారు. దాదాపు 9000మంది వివరాలను ఇప్పటివరకు సేకరించినట్లుగా తెలిపారు. ప్రధాని కాన్వాయ్ వచ్చే ప్రాంతం పొడవునా భద్రతను ముమ్మరం చేశామని, వందలాది సిసి టివి కెమెరాలను ఏర్పాటుచేశామని తెలిపారు. జూలైలోనే ఈ భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని సీనియర్ నిఘా అధికారులు ఎప్పటికప్పుడు వీటిపై దృష్టిపెట్టి పంద్రాగస్టు సందర్భంగా సురక్షిత వాతావరణాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు.