జాతీయ వార్తలు

వరదలతో ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 14: గత మూడు రోజులుగా బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా రాష్ట్రాలు అతలాకుతల మయ్యాయ. అనేక ప్రాంతాల్లో రవాణా, సమాచార వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. బిహార్‌లో వరద పరిస్థితిని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏరియల్ సర్వే చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి నెలకొందని చెప్పారు. వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించి రోడ్లు, పంటలు లాంటి వాటికి కలిగిన నష్టాన్ని అంచనా వేస్తారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఆదివారం మాట్లాడిన వెంటనే సహాయం అందించడంలో తక్షణం స్పందించినందుకు ఆయన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో కూడా తాను మాట్లాడినట్లు నితీశ్ చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలు చేపట్టడం కోసం పూర్ణియా జిల్లాకు సైన్యాన్ని పంపించడంతోపాటుగా నాలుగు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నిన్ననే రాష్ట్రానికి వచ్చాయని, మరో ఆరు బృందాలు ఈ రోజు చేరుకున్నాయని ఆయన తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో
మొన్నటివరకు బెంగాల్‌లోని దక్షిణ ప్రాంతానికే పరిమితమైన వరదలు ఇప్పుడు ఉత్తర ప్రాంతాన్ని కూడా వణికిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రధాన నదులన్నీ కూడా ప్రమాద స్థాయిని మించి ప్రయవహిస్తున్నాయి. అధికారులు 24 గంటలు సహాయ, పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పరిధిలో వరద నీరు రైలు మార్గాలపై ప్రవహిస్తూ ఉండడంతో కోల్‌కతానుంచి బయలుదేరే అనేక రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు రైల్వే చీఫ్ పిఆర్‌ఓ చెప్పారు.
సోనోవాల్‌కు ప్రధాని అభయం
న్యూఢిల్లీ: వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అస్సాంలో పరిస్థితి మరింత క్షీణిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఈ వరదల వల్ల దాదాపు 99 మంది మృతిచెందగా, 21 జిల్లాల్లో 22.5 లక్షల మంది బాధితులుగా మారని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం మరోసారి అస్సాం ముఖ్యమంత్రి శరభానంద్ సోనోవాల్‌తో మాట్లాడి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అభయమిచ్చారు. వరదల వలన ప్రస్తుతం అస్సాంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని, ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కడంలో అస్సాంకు అన్ని విధాలుగా సాధ్యమైన తోడ్పాటును అందజేస్తామని మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ సమగ్రమైన నివేదికను సమర్పించాలని ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వికె.పిపెర్సెనియాని ఆదేశించారు.
స్తంభించిన సమాచార వ్యవస్థ
ఇటానగర్: వరదల వలన అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా, ఈస్ట్ సియాంగ్, నమ్సాయ్ జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లగా, పపుంపారె, ఈస్ట్ కమెంగ్, వెస్ట్ సియాంగ్ జిల్లాలకు పాక్షిక నష్టం వాటిల్లింది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి లోహిత్ నుంచి మారుమూల ప్రాంతంలోని అంజా జిల్లాకు వెళ్లే రోడ్డు గత ఏడు రోజులుగా మూసుకుపోవడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో ఆ జిల్లాకు సంబంధాలు తెగిపోయాయి.
నేపాల్‌లో 78 పెరిగిన మృతులు
ఖాట్మండు: నేపాల్‌లో వరదల వలన సోమవారం మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 78 పెరిగింది. అయితే నేపాల్‌లో చిక్కుకుపోయిన 25 మంది భారతీయులు వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాలయాల్లోని వివిధ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని, దీంతో వరదలు సంభవించి అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో 27 మంది మృతి
ఢాకా: భారీ వర్షాల కారణంగా బంగ్లాదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించడంతో దాదాపు 27 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 24 జిల్లాల్లో మరో ఆరు లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారని అధికారులు సోమవారం వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వచ్చిపడుతున్న వరద ప్రవాహాలతో దాదాపు 20 జిల్లాలు అతలాకుతలమవుతున్నాయని వారు తెలిపారు.

చిత్రాలు.. బిహార్‌లో వరద పరిస్థితిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. * పశ్చిమ బెంగాల్‌లోని బాల్‌ఘాట్‌లో వరద నీటిలో ప్రజల అవస్థలు *అస్సాంలోని జోఖలబంధా ప్రాంతంలో నీటమునిగిన రైల్వే ట్రాక్