జాతీయ వార్తలు

‘మేక్ ఇన్ ఇండియా’ పోయింది.. ‘మేడ్ ఇన్ చైనా’ కనిపిస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ ఘోరంగా విఫమైందని, ఇప్పుడున్నదంతా ‘మేడ్ ఇన్ చైనా’ మాత్రమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై అసమ్మతి పోరాటం ప్రారంభించిన జెడి(యు) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్ గురువారం ‘వారసత్వ పరిరక్షణ’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సదస్సులో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. శరద్ యాదవ్ ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్‌తోపాటు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి.రాజా తదితర నాయకులు హాజరయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనల మేరకు బిజెపి భారతదేశాన్ని కులాల ఆధారంగా విభజిస్తోందని రాహుల్ ఆరోపించారు. నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించిన భారత్ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది, ఇప్పుడు ఎక్కడ చూసినా చైనా తయారీ వస్తువులు కనిపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ వారం రోజుల నుండి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తుండటం తెలిసిందే. నరేంద్ర మోదీకి అబద్ధాలు చెప్పటం అలవాటుగా మారిందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కలిసి కట్టుగా కృషిచేయాలని, అప్పుడే బిజెపిని ఓడించగలుగుతామని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ అబద్ధపు మాటలన్నీ ప్రజల ముందు పెట్టాలని అన్నారు. ‘స్వచ్చ భారత్’ గురించి తెగ మాట్లాడుతున్నారు, తాను మాత్రం ‘సఛ్ భారత్’ (నిజమైన భారత్) కావాలంటున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ ప్రసంగమంతా నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై కేంద్రీకృతం కావటం గమనార్హం. దేశాన్ని కులాల ఆధారంగా విభజించటం ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని ఆయన ఆరోపించారు. ‘ఈ దేశం నాది’ అని మనమంటే ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం ‘తామీ దేశానికి చెందిన వార’మని అంటోందన్నారు. ఇది మా దేశం, మీరీ దేశానికి చెందినవారు కాదంటూ ఆర్‌ఎస్‌ఎస్ కొన్ని వర్గాలను ఈ దేశానికి దూరం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. గుజరాత్‌లో దళితులపై దాడిచేస్తూ మీరీ దేశానికి చెందిన వారు కాదని చెప్పిన విషయాన్ని గమనించాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయాలని ఆయన ప్రతిపక్షాలకు పిలుపిచ్చారు. రాజ్యాంగం బడుగు, బలహీన, దళిత వర్గాలకు కల్పిస్తున్న భద్రతలను తొలగించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ తెరవెనక ప్రయత్నాలు చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థ, మీడియా తదితర అన్ని ముఖ్యమైన వ్యవస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్ తన మనుషులను నియమిస్తోందని అన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాతే ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తున్నారు, అధికారంలోకి రానంతకాలం వారు త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయలేదని ఆరోపించారు. రైతు రుణాల మాఫీ విషయంలో కేంద్రం రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తోందని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీ రుణ మాఫీ గురించి మాట్లాడితే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం రుణాలను మాఫీ చేయటం సాధ్యం కాదంటారు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా తమ విధానం మారదని జైట్లీ చెబుతున్నారని ఆయన ఆరోపించారు. బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల సమైక్యత చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.