జాతీయ వార్తలు

ఉగ్రవాదం, నక్సలిజానికి కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి / లక్నో, ఆగస్టు 20: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో మావోయిస్టులకు అలాగే కాశ్మీర్‌లోని వేర్పాటువాదులకు నిధులు అందకుండా పోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ముంబయిలో స్పష్టం చేస్తే, జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నిర్వహిస్తున్న గురుతర పాత్ర కారణంగా కాశ్మీర్‌లో రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు తగ్గిపోయాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఓకేరోజు వేర్పాటువాదం, నక్సలిజం వంటి సవాళ్లపై మాట్లాడటం, వీటి ప్రాబల్యం తగ్గిందని పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ముంబయి బిజెపి అధ్యక్షుడు అశిష్ షేలర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. పెద్దనోట్ల రద్దుకు ముందు కాశ్మీర్ ఆందోళనకారులు వేలాది రోడ్లపై గుమిగూడి భద్రతా దళాలపై రాళ్లు రువ్వేవారని, ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నా పాతిక మంది మించి రావడం లేదని జైట్లీ పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని వేర్పాటువాదులకు చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులకు పెద్దనోట్ల రద్దు తీవ్ర విఘాతమే కలిగించిందని, దాదాపుగా వారికి నిధులు అందకుండా పోయాయని జైట్లీ తెలిపారు. అలాగే భద్రతా దళాలు కూడా కాశ్మీర్ మిలిటెంట్లపై పై చేయి సాధించాయని పేర్కొన్న ఆయన ఈ సరిహద్దు రాష్ట్రంలో సాయుధ మిలిటెన్సీని అణిచివేయాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాశ్మీర్ సమస్య సంక్లిష్టం కావడానికి కారణం పొరుగుదేశం నుంచి ఉగ్రవాదులకు అందిన మద్దతేనని, అలాగే కొన్ని స్థానిక గ్రూపులు కూడా ఇందుకు కారణమయ్యాయని జైట్లీ విశే్లషించారు. దశాబ్దాలుగా కాశ్మీర్ సమస్య మగ్గుతున్నప్పటికీ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వం ఓ స్పష్టమైన పరిష్కార విధానాన్ని అమలు చేయలేకపోయిందని జైట్లీ అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యను పరిష్కరించలేకపోయిన కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పుడు తమను ప్రశ్నించే అధికారమే లేదన్నారు. నాటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కుంటిసాకులతో సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసిందే తప్ప ఎలాంటి కచ్చితమైన చర్యలు తీసుకోలేదన్నారు. కాని మోదీ సర్కారు మాత్రం కాశ్మీర్ విషయంలో చాలా స్పష్టమైన దృక్పథంతోనే వ్యవహరిస్తోందని తెలిపారు.
ఉగ్రవాదం తగ్గుముఖం: రాజ్‌నాథ్
దేశంలో గత మూడేళ్లుగా ఇటు ఉగ్రవాదం, అటు నక్సలిజం తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత దేశ భద్రతను పరిరక్షించాలని తమ ప్రభుత్వం ప్రతినబూనిందని ఇందుకోసం అవసరమైన కఠిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా దాన్ని ముఖాముఖీ ఢీకొంటున్నామని ఆదివారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేసిన రాజ్‌నాథ్ సింగ్ ఈ లక్ష్యంతోనే నక్సలిజం, టెర్రరిజం, అతివాదాన్ని క్రమంగా అణిచివేస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులోనే ఈ మూడు జాడ్యాలపై ప్రభుత్వం పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. గత మూడేళ్లలో ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం 75 శాతం తగ్గిందని, అలాగే నక్సలిజం కూడా 35 నుంచి 40 వరకు తగ్గిందని తెలిపారు. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఈ విషయంలో ఎన్‌ఐఏ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు.

చిత్రాలు.లక్నోలో ఆదివారం జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
*ఆదివారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్