జాతీయ వార్తలు

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28 లేదా సెప్టెంబర్ 2వ తేదీనాడు కేంద్ర మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. తమిళనాడు శాసనసభలో అన్నాడిఎంకె ప్రభుత్వం బలపరీక్ష జరిగిన అనంతరం కేంద్ర మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణం జరుగుతుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అన్నాడిఎంకె, జెడి(యు)లకు మంత్రివర్గంలో స్థానం కల్పించటంతోపాటు ఐదు సీనియర్ మంత్రులతోపాటు మొత్తం పదిహేను మంది మంత్రుల శాఖలు మారనున్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. అన్నాడిఎంకెకు ఒక క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు, జెడి(యు)కు కూడా ఒక క్యాబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు లభించవచ్చునని అంచనా వేస్తున్నారు. అన్నాడిఎంకె, జె.డి(యు)లకు కేటాయించవలసిన శాఖల విషయంలో ఇరుపక్షాల మధ్య ఒక అవగాహన కుదిరిందనే మాట వినిపిస్తోంది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణంలో తెలుగుదేశం పార్టీకి ఒక సహాయ మంత్రి పదవి లభించవచ్చునని చెబుతున్నారు. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహంకు సహాయ మంత్రి పదవి లభించవచ్చునని అంటున్నారు. ఏపి బిజెపి శాఖ అధ్యక్షుడు, విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు హరిబాబుకు కూడా సహాయ మంత్రి పదవి లభిస్తుందనే మాట వినిపిస్తోంది. బిజెపి సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్య నాయకుడు ఉపరాష్టప్రతి పదవి చేపట్టినందున హరిబాబుకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని కాపులను సంతృప్తి పరిచేందుకు తోట నరసింహంకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని హోం శాఖకు, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రక్షణ శాఖకు పంపించవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రైల్వే శాఖకు పంపించి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన సురేష్ ప్రభును ఇంధనం శాఖకు బదిలీ చేస్తారని అంటున్నారు. ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు పదోన్నతి ఇచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా నియమించవచ్చునని చెబుతున్నారు. కనీసం నలుగురు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.