జాతీయ వార్తలు

పార్టీ ప్రతినిధినుంచి.. రక్షణ మంత్రి దాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఆదివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఎవరూ ఊహించని విధంగా నిర్మలా సీతారామన్‌కు రక్షణమంత్రిగా కీలకమైన పదోన్నతి లభించింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలు చేపడుతున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. 1970 దశకంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలతో పాటుగా రక్షణ శాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. ఇప్పటివరకు వాణిజ్య శాఖను సమర్థవంతంగా నిర్వహించినందుకే ఆమెకు ఈప్రమోషన్ లభించిందని చెప్పవచ్చు.
నిజానికి సీతారామన్ రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభలో కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మలా సీతారామన్ తొలుత పార్టీ అధికార ప్రతినిధిగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించి నేటికి రక్షణ మంత్రి స్థాయికి చేరుకున్నారు. గత మార్చిలో గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కోసం మనోహర్ పారికర్ రక్షణ మంత్రి పదవినుంచి తప్పుకొన్నప్పటినుంచి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే రక్షణ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న విషయం తెలిసిందే. తన వారసురాలిగా వచ్చిన నిర్మలా సీతారామన్ అత్యంత సమర్థురాలని ఆమెను అభినందిస్తూ జైట్లీ చేసిన వ్యాఖ్యలే ఆమె సమర్థతకు నిదర్శనం. ఇప్పుడు రక్షణ మంత్రిగా ఆమె భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో సభ్యురాలు కానున్నారు. ఈ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సభ్యులుగా ఉంటారు. కాగా, ఈ కమిటీలో ఇప్పుడు ఇద్దరు మహిళలు సభ్యులుగా ఉండడం విశేషం.
1958 ఆగస్టు 18న తమిళనాడులోని మదురైలో నారాయణ్ సీతారామన్, సావిత్రి దంపతులకు జన్మించిన నిర్మలా సీతారామన్ తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కళాశాలనుంచి బిఏ, ప్రతిష్ఠాత్మక ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీనుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పట్టా అందుకున్నారు. ఇండో-యూరోపియన్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఆమె చేసిన పరిశోధనకు డాక్టరేట్, ఆ తర్వాత ఎంఫిల్ పట్టా పొందారు. ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా, ఆ తర్వాత బిబిసి వరల్డ్‌లోను పని చేశారు. హైదరాబాద్‌లో ప్రణవ స్కూల్స్ వ్యవస్థాపకుల్లో నిర్మలా సీతారామన్ ఒకరు. గతంలో ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా సేవలందించారు.
భర్త పరకాల ప్రభాకర్ 2007లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరినప్పటికీ నిర్మలా సీతారామన్ మాత్రం భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలో క్రమంగా ఎదుగుతూ నితిన్ గడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని పార్టీ ప్రత్యేక ప్రతినిధి బృందం సభ్యురాలుగా ఆమె తనకప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ తన ప్రత్యేకతను చాటుకొన్నారు. బిజెపి అధికార ప్రతినిధిగా 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ వాణిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన మంత్రివర్గంలో వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా చేరారు. ఆంధ్రప్రదేశ్‌నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయిన నిర్మలా సీతారామన్ ఆ తర్వాత గత ఏడాది కర్నాటకనుంచి ఎన్నికయ్యారు. తాను దక్షిణాదికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని సగర్వంగా చెప్పుకొనే నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు కూడా.
కాగా, రక్షణ మంత్రిగా ఇప్పుడు నిర్మలా సీతారామన్‌పై గురుతర బాధ్యతలే ఉన్నాయని చెప్పవచ్చు. ఓ వైపు సరిహద్దుల్లో పాక్ కవ్వింపులకు తోడు చైనా సైతం ఉద్రిక్తతలను పెంచడానికి యత్నిస్తున్న తరుణంలో సైన్యంలోని త్రివిధ దళాలను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ఇటీవలే అనేక చర్యలు తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటుగా రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా స్వావలంబన సాధించడం, త్రివిధ బలగాల ఆధునీకరణ కార్యక్రమాన్ని కొనసాగించడంలాంటి అనేక సంక్లిష్ట సవాళ్లు ఆమె ముందున్నాయనే చెప్పాలి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని చూస్తే ఆమె ఈ కొత్త బాధ్యతను సైతం సమర్థవంతంగా కొనసాగిస్తారనే భావించవచ్చు.

చిత్రం..రక్షణ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం వినమ్రంగా నమస్కరిస్తున్న సీతారామన్