జాతీయ వార్తలు

సీతారామన్‌కు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి మండలిలో సమర్థతకు మంచి బహుమతి ఇచ్చారు. మూడేళ్ల పదవీకాలంలో తన కేబినెట్‌లో ప్రతిభావంతంగా పనిచేసిన నలుగురు సహాయ మంత్రులకు కేబినెట్ హోదాతో ప్రమోషన్ ఇవ్వటమే కాకుండా, కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగించటం విశేషం. వీరితో పాటు కొత్తగా తొమ్మిది మంది సహాయ మంత్రులను ప్రధాని తన మంత్రి మండలిలో చేర్చుకుని ఆదివారం నాడు మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటివరకు స్వతంత్ర హోదాలో వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేస్తున్న నిర్మలాసీతారామన్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. భారతదేశం స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఈ శాఖ బాధ్యతలను ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ కొంతకాలం చూసినా పూర్తికాలపు మహిళా రక్షణ మంత్రిగా తొలి అవకాశం నిర్మలాసీతారామన్‌కు లభించింది. ఇంధన మంత్రిగా ఉన్న పీయూష్‌గోయల్‌కు సురేశ్‌ప్రభు స్థానంలో రైల్వే శాఖను అప్పగించారు. సురేశ్‌ప్రభు వాణిజ్యశాఖను పర్యవేక్షిస్తారు. ధర్మేంద్రప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసినప్పటికీ వారి శాఖల్లో మార్పు రాలేదు. ఉమాభారతి నుంచి జలవనరుల శాఖను తప్పించి తాగునీరు, పారిశుధ్యానికి పరిమితం చేశారు. ఇక సీనియర్ మంత్రి నితిన్ గడ్కరీకి రైల్వే మినహా మిగతా రవాణా వ్యవస్థల బాధ్యతలన్నీ లభించాయి. ప్రస్తుత రోడ్డు రవాణాతో పాటు తాజాగా జలవనరులు, నదుల అభివృద్ధి కూడా ఆయన పరిధిలోకి వచ్చాయి. ఈ విస్తరణలో సివిల్ సర్వీస్ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా పరిపాలనను మరింత పదిలం చేసుకునేందుకు మోదీ ప్రయత్నించారు. తొమ్మిది మంది కొత్త మంత్రుల్లో ఒక సిక్కు, ఒక క్రైస్తవుడు ఉన్నారు. ఈ ఇద్దరు కొత్త మంత్రులూ హర్దీప్ సింగ్ పురి, ఆల్ఫోన్స్ కన్నంతానం ఏ సభకూ చెందనివారు కావటం గమనార్హం. వీరిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేయవలసి ఉన్నది. కొత్త మంత్రుల్లో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు- రాజ్‌కుమార్ సింగ్, ఆల్ఫోన్స్ కన్నంతానం, ఒక ఏఎఫ్‌ఎస్ అధికారి- హర్దీప్ సింగ్ పురి, ఒక ఐపిఎస్- సత్యపాల్ సింగ్ ఉన్నారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో మంత్రుల చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. నలుగురు సహాయ మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులుగా శివప్రతాప్ శుక్లా, అశ్వినీకుమార్ చౌబే, డాక్టర్ వీరేంద్ర కుమార్, అనంతకుమార్ హెగ్డే, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్‌సింగ్ పురి, గజేంద్రసింగ్ చౌహాన్, సత్యపాల్ సింగ్, ఆల్ఫోన్స్ కన్నంతానం ప్రమాణ స్వీకారం చేశారు.
నరేంద్ర మోదీ మంత్రివర్గం విస్తరణను బిజెపికి మాత్రమే పరిమితం చేసినందుకు ఆగ్రహించిన మిత్రపక్షాలు శివసేన, జెడి(యు) ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాయి. అన్నాడిఎంకె ఎంపీలు కూడా ఎవ్వరూ కనిపించలేదు. నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, పలువురు సీనియర్ మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. సహాయ మంత్రులుగా నియమితులైన వారిలో రాజ్‌కుమార్ సింగ్ హోం శాఖ కార్యదర్శిగా పని చేశారు. ఐఎఫ్‌ఎస్ అధికారి హర్దీప్ సింగ్ పురి శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా పని చేసినప్పుడు భారత, శ్రీలంక ఒప్పందానికి రూపకల్పన చేశారు. ఐపిఎస్ అధికారి సత్యపాల్ సింగ్ ముంబాయి కమిషనర్‌గా పని చేయటంతోపాటు మహారాష్ట్ర డిజిపిగా పదవీ బాధ్యతలు కూడా నిర్వహించారు. కేరళకు చెందిన ఆల్ఫోన్స్ కన్నంతానం దేశ రాజధాని ఢిల్లీలో పని చేసినప్పుడు పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చివేసిన ఘనత సంపాదించుకున్నారు. సహాయ మంత్రులుగా చేరిన నలుగురు సీనియర్ అధికారులు నిబద్ధతకు కట్టుబడి పనిచేసేవారుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకే నరేంద్ర మోదీ వారిని మంత్రివర్గంలో చేర్చుకున్నారని అంటున్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గం విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట వేశారు. 71 మంది ఎంపీలను గెలిపించిన ఉత్తర ప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంద్వారా 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో ప్రజల మద్దతు సంపాదించుకునేందుకు ప్రయత్నించారు. దీనితోపాటు సీనియర్ నాయకుడు శివ ప్రతాప్ శుక్లాను సహాయ మంత్రిగా నియమించటం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించారు. సహాయ మంత్రులుగా నియమితులైన అశ్వినీ కుమార్ చౌబే, రాజ్‌కుమార్ సింగ్‌ల ద్వారా బిహార్‌లో బిజెపి పట్టు పెంచేందుకు మోదీ ప్రయత్నించారు. అనంతకుమార్ హెగ్డేను సహాయ మంత్రిగా నియమించి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్నాటకకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఐఏఎస్ అధికారి ఆల్ఫోన్స్ కన్నంతానంను మంత్రివర్గంలో చేర్చుకోవటం ద్వారా కేరళలలో బి.జె.పి పట్టు పెంచటంతో పాటు క్రైస్తవ మైనారిటీల విశ్వాసం సంపాదించేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నించారని అంటున్నారు.
మిత్రపక్షాల ఆగ్రహం
మంత్రివర్గం విస్తరణ జెడియు, శివసేన, తెలుగుదేశం తదితర మిత్రపక్షాలతోపాటు అన్నా డిఎంకెను కూడా అసంతృప్తికి గురి చేసింది. మిత్రపక్షాలతోపాటు స్వపక్షానికి చెందిన పలువురు ఎంపిలు కూడా మంత్రి పదవులు లభించనందుకు లోలోపల మండిపడుతున్నారు. మంత్రివర్గం విస్తరణను బిజెపికి పరిమితం చేసినందుకు ఆగ్రహించిన జెడియు, శివసేన పార్టీలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. అన్నా డిఎంకె సభ్యులు కూడా రాష్టప్రతి భవన్‌కు దూరంగా ఉండిపోయారు. మంత్రివర్గం విస్తరణ గురించి తమతో చర్చించలేదని జెడియు నాయకులు వెళ్లడించగా ఇలా చేయటం అన్యాయమని శివసేన నాయకులు చెప్పారు. అందుకే శివసేనకు చెందిన మంత్రులు సైతం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు. ఇదిలా ఉంటే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా అసంతృప్తికి గురైందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లోకసభలో పార్టీ పక్షం నాయకుడు తోట నరసింహం, రాజ్యసభలో పార్టీ పక్షం ఉపనాయకుడు సిఎం రమేష్‌లు మంత్రి పదవులు ఆశించి నిరాశ చెందవలసి వచ్చింది.

చిత్రం..కేంద్ర కేబినెట్ విస్తరణ అనంతరం రాష్టప్రతి కోవింద్, ఉప రాష్టప్రతి వెంకయ్య, ప్రధాని మోదీలతో కొత్త మంత్రులు