జాతీయ వార్తలు

లాలూతో తెగతెంపులు చేసుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: బిహార్‌లో కాంగ్రెస్ పుట్టి మునుగుతోంది. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెగతెంపులు చేసుకోకపోతే పార్టీనుంచి వెళ్లిపోతామంటూ 11 మంది కాంగ్రెస్ శాసన సభ్యులు పార్టీ అధినాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. వీరంతా బుధవారం రాత్రి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయలు, ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ యాదవ్ వ్యవహారంపై చర్చించారు. లాలూ నాయకత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న మహాకూటమి నుంచి తప్పుకోవటం మంచిదని వారు అధినాయకత్వానికి స్పష్టం చేశారు. ‘లాలూ ప్రసాద్ యాదవ్‌తోకలిసి పని చేసినంత కాలం కాంగ్రెస్ బతికి బట్టకట్టదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేం. ఓట్లు కూడా పడవు’అని రాహుల్‌కు కరాకండిగా చెప్పేశారు. లాలూ , అతని ఇద్దరు కుమారుల అవినీతి మూలంగానే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మహాకూటమి నుంచి తప్పుకుని బిజెపితో చేతులు కలపవలసి వచ్చిందని వారు అన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఆర్జేడీ పేరుప్రతిష్ఠలు పూర్తిగా దెబ్బతిన్నాయని, లాలూను పెద్ద అవినీతి పరుడిగా జనం భావిస్తున్నారని 11 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. స్వార్థం కోసమే లౌకికవాదాన్ని ఎత్తుకున్నారే తప్ప మైనారిటీల ప్రయోజనాలు కాపాడేందుకు కాదని, ఈ విషయం ప్రజలకు అర్థమవుతోందని రాహుల్‌కు చెప్పారు. ఇలా ఉండగా లాలూతో కలిసి పనిచేయటం రాహుల్‌కు ఇష్టం లేకపోయినా గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుకు ఆయన కూడా కృషి చేయటం తెలిసిందే. ఇప్పుడు మహాకూటమి నుంచి తప్పుకోవటం మంచిది కాదేమోననే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. సోనియా గాంధీకి కూడా లాలూ ప్రసాద్ యాదవ్‌పట్ల సానుభూతి ఉంది. దీనికి కారణం లేకపోలేదు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టటం వెనక లాలూ ప్రసాద్ యాదవ్ పాత్ర ఉంది. ఇలాంటి పలు కారణాల మూలంగా సోనియా ఆర్జేడి అధినేత లాలూ పట్ల కఠినంగా వ్యవహరించకలేకపోతున్నారు. అయితే బిహార్ కాంగ్రెస్ శాసన సభ్యులు మాత్రం ఇవేవీ పట్టించుకునే స్థితిలో లేరు. కొన్ని రోజుల క్రితం సోనియా గాంధీని కలిసినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెగతెంపులు చేసుకోకపోతే చాలామంది కాంగ్రెస్ నుంచి బైటికి వెళ్లిపోతారని వారు తెలిపారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసింది. బిహార్‌లో కాంగ్రెస్‌కు 27 మంది శాసన సభ్యులుంటే ఇందులో ఆరుగురు ఇప్పటికే అధినాయకత్వానికి దూరంగా ఉంటున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసేందుకు కూడా వారు ఇష్టపడటం లేదు. నియోజకవర్గాల్లో బిజీగా ఉన్నందున తామిప్పుడే ఢిల్లీకి రాలేమని వారంటున్నారు. మిగతా 21 మందిలో పది మంది ఇదివరకే సోనియా గాంధీని కలిసి లాలూ ప్రసాద్ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. ఆయనతో తెగతెంపులు చేసుకోకపోతే బిహార్‌లో కాంగ్రెస్‌ను కాపాడుకోలేమని తేల్చి చెప్పేశారు. రాహుల్ గాంధీ గురువారం ఐదుగురు కాంగ్రెస్ శాసన సభ్యులతో సమావేశమై పరిస్థితిని మరోసారి సమీక్షించారు. మహాకూటమితో తెగతెంపులు చేసుకోవటంపై కాంగ్రెస్ అధినాయకత్వం వీలున్నంత త్వరగా ఒక నిర్ణయం తీసుకోవటం మంచిదని వారు చెబుతున్నారు. మతతత్వ బిజెపితో పోరాడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్‌ను దూరం చేసుకోవటం మంచిది కాదన్న సోనియా గాంధీ అభిప్రాయంతో వారు ఏకీభవించటం లేదు. ఈ తాజాపరిణామాల నేపథ్యంలో లాలూపై కాంగ్రెస్ అధినాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.