జాతీయ వార్తలు

‘డేరా’తీసేకొద్దీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిర్సా, సెప్టెంబర్ 8: ఇద్దరు సాధ్వీలపై అత్యాచా రం చేశాడన్న ఆరోపణలపై ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీ మ్ సింగ్ అకృత్యాలు తవ్విన కొద్దీ బైటపడుతున్నా యి. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలపై ప్రధాన కార్యాలయం లో శుక్రవారం పెద్ద ఎత్తున జరిపిన సోదాల్లో కొన్ని కీలకమైన హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్, కంప్యూటర్లను, రద్దయిన పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో భద్రతా దళాలు, హర్యానా పోలీసులు భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారని, ఆశ్రమంలోని కొన్ని గదులకు తాళాలు కూడా వేసినట్లు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల డిప్యూటీ డైరెక్టర్ సతీశ్ మెహ్రా చెప్పారు.
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నేతృత్వంలో ఈ సోదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ‘కొన్ని గదులకు తాళాలు వేయడం జరిగింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, రిజిస్టర్ నంబరు లేని ఒక లగ్జరీ కారు, ఒక ఓబి వ్యాన్, రూ. 7 వేల విలువయిన రద్దయిన కరెన్సీ, 12 వేల నగదు, లేబుళ్లు, కంపెనీ పేరు లేని కొన్ని మందులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మెహ్రా చెప్పారు. కర్నాల్, సోనిపట్‌లనుంచి ఫోరెన్సిక్ బృందాలు సిర్సాకు చేరుకున్నాయని, ఉత్తరాఖండ్‌లోని రూర్కీనుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించడం జరుగుతోందని ఆయన చెప్పారు. కాగా, తనిఖీల సమయంలో ప్లాస్టిక్ నాణేలు, లేదా టోకెన్లు లభ్యమయినట్లు వచ్చిన వార్తలు మాత్రం ద్రువీకరణ కాలేదు. కాగా, ఈ సోదాలు వారం రోజుల పాటు కొనసాగవచ్చని తెలుస్తోంది.
సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. తనిఖీలను పర్యవేక్షించడానికి రాష్ట్ర హైకోర్టు నియమించిన రిటైర్డ్ జిల్లా, సెషన్స్ జడ్జి ఎకెఎస్ పవార్ పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ముందుజాగ్రత్త చర్యగా డేరా ప్రధాన కార్యాలయానికి వెళ్లే మార్గాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దాదాపు 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయాన్ని పది విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగానికి ఒక్కో సీనియర్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు.ఎలాంటి పుకార్లు వ్యాప్తి కాకుండా చూడడం కోసం ముందుజాగ్రత్త చర్యగా సిర్సా జిల్లాలో ఈ నెల 10 దాకా మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మీడియా వాళ్లను కూడా డేరా ప్రధాన కార్యాలయానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. డేరా చుట్టూ ఏర్పా టు చేసిన నాకాల వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించారు. అనుమతి, తగిన సాక్ష్యాధారాలు లేకుండా ఏ ఒక్కరినీ లోపలికి అనుమతించడం లేదు.
శుక్రవారం తెల్లవారే సమయానికే భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులతో పెద్ద సంఖ్యలో వాహనాలు డేరా ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ వాహనాల్లో పోలీసు బస్సులు, పారా మిలిటరీ, క్విక్ యాక్షన్ ఫోర్స్ వాహనాలు, బాంబు డిస్పోజల్ బృందాల వాహనాలులాంటివి ఉన్నాయని అధికారులు చెప్పారు. అగ్నిమాపక యంత్రాలు, ప్రొక్లెయినర్లు లాంటి భారీ యంత్రాల ను కూడా రంగంలోకి దింపడంతో పాటు తాళా లు తెరవడం కోసం నిపుణులయిన పనివాళ్ల సహాయం కూడా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీలకు సంబంధించి తమ వద్ద పక్కా ప్రణాళిక ఉంద ని, సోదాల ప్రక్రియ ప్రవాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నామని, డేరా మేనేజ్‌మెంట్ కూడా స్థానిక పోలీసులు, ఉన్నతాధికారులకు సహకరిస్తామని హామీ ఇచ్చిందని హర్యానా పోలీసు డిజిపి బిఎస్ సంధు అంతకు ముందు చండీగఢ్‌లో చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే తనిఖీలకు తాము పూర్తి సహకారం అందిస్తామని డేరా చైర్‌పర్సన్ విపాసనా ఇన్సాన్ చెప్తూ ప్రశాంతంగా ఉండాలని అందరినీ కోరుతున్నామని తెలిపారు.
కాగా, డేరాలోపల పెద్ద సంఖ్యలో అస్థి పంజరాలున్నాయని సోదాలు మొదలు కావడానికి కొద్ది గంటల ముందు డేరా పత్రిక ‘ సచ్ కహూ’ వెల్లడించింది. అయితే ఈ వార్తలను అధికారులు ధ్రువీకరించలేదు.

చిత్రాలు.. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా స్థావరాలపై శుక్రవారం దాడులకు సిద్ధమవుతున్న అధికారులు
* డేరా ప్రధాన స్థావరాన్ని తాళాలు వేసిన దృశ్యం