జాతీయ వార్తలు

పాడి వృద్ధికి ప్రత్యేక నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, సెప్టెంబర్ 26: దేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి 10,881 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం డెయిరీ ప్రాసెసింగ్, వౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (డిపిఐడిఎఫ్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ మంగళవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిధి ద్వారా దాదాపు 50 వేల అగామాల్లో 95 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని ఇక్కడికి సమీపంలోని ఆనంద్‌లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలను ఆయన అందజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నిధిని ఎన్‌డిడిబి, ఎన్‌సిడిసిలు ఉపయోగించుకుంటాయని పేర్కొన్న ఆయన పాల సేకరణ విధానాన్ని బలోపేతం చేసేందుకు నిధులు సమకూరుస్తాయని, అలాగే ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు వీటిని వినియోగిస్తాయని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో పాల సేకరణ కార్యకలాపాలు కొత్త వృద్ధిని సంతరించుకున్నందున ఈ నిధితో ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్పష్టం చేశారు.
ఈ నిధి ద్వారా పాల సేకరణ వ్యవస్థను విస్తరించడంతో పాటు పాల కల్తీని నివారించేందుకు ఎలక్ట్రానిక్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాల ఉత్పత్తి కేంద్రాలు, కంపెనీలు కూడా పలు రకాలుగా విలువ ఆధారిత వినియోగ వస్తువులను ఉత్పత్తి చేయడానికి కూడా ఈ నిధిద్వారా రుణకల్పన సాధ్యమవుతుందని సింగ్ తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతులందరికీ వారి ఉత్పత్తులకు తగిన ధర లభించేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పశుగణాభివృద్ధి, చేపల పరిశ్రమ, వ్యవసాయ విద్య, పరిశోధన తదితర అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
2020 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా అనేక పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గతంలో వాజపేయి ప్రభుత్వం అమలు చేసిన అనేక వ్యవసాయ సంక్షేమ పథకాలను అనంతరం వచ్చిన యుపిఏ ప్రభుత్వం గాడి తప్పించిందన్నారు. జాతీయ పాడి అభివృద్ధి ప్రాజెక్టు( ఎన్‌డిపి) ప్రధాన లక్ష్యం పాల ఉత్పాదకతను పెంచడమేనని, నానాటికీ పెరుగుతున్న పాల వినియోగ అవసరాలను తీర్చేందుకు పలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.