జాతీయ వార్తలు

మరింత వేగం.. సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: రైల్వేల ఆధునీకరణ, ప్రయాణికుల భద్రత పెంచేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి మనోజ్ సిన్హా, రైల్వే బోర్డు అధ్యక్షుడు అశ్వినీ లోహానీ గురువారం విలేఖరుల సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు. రైలు ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక ఆధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పీయూష్ గోయల్ ప్రకటించారు. ఐదువేల లేవల్ క్రాసింగ్‌ల వద్ద ఒక నిర్ణీత కాలంలో గార్డులను నియమిస్తాం, నవంబర్ నుండి ఏడు వందల రైళ్ల వేగాన్ని పెంచుతున్నామని ఆయన తెలిపారు. మొత్తం రైల్వే వ్యవస్థను విద్యుదీకరించటం ద్వారా డీజిల్‌పై ఖర్చు చేస్తున్న పదివేల కోట్ల రూపాయలను ఆదా చేస్తామని తెలిపారు. రైల్వే లైన్ల విద్యుదీకరణను నాలుగైదేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రైల్వే లైన్ల విద్యుదీకరణ వలన ఇంధన ఖర్చు బాగా తగ్గుతుంది. దాదాపు పదిహేల కోట్ల రూపాయలు ఆదా కావటంతోపాటు కాలుష్యం తగ్గుతుందన్నారు. రైలు ప్రమాదాలను నూటికి నూరు శాతం అరికట్టేందుకు మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రేన్ ప్రొటెక్షన్, వార్నింగ్ సిస్టం (టిపిడబ్ల్యుఎస్), మొబైల్ ట్రేన్ రేడియో కమ్యూనికేషన్ (ఎంటిఆర్‌సి)ని ఏర్పాటు చేయటంద్వారా మొత్తం సిగ్నలింగ్ వ్యవస్థను పునర్ వ్యవస్థీకరిస్తామని ఆయన చెప్పారు. రైలు ప్రయాణికులకు ఉన్నతస్థాయి భద్రత, వేగం, సమర్థ సేవలు అందించేందుకు తమ శాఖ కట్టుబడి ఉన్నదని పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే వ్యవస్థను సమర్థంగా నిర్వహించటం ద్వారా దేశాభివృద్ధికి తమ వంతు నిధులను అందజేస్తామన్నారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కొంత వ్యవధి పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి పాత లైన్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని పియూష్ గోయల్ చెప్పారు. రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేందుకు సిసిటివి కెమెరాలను ఏర్పాటుచేస్తాం, రైల్వే స్టేషన్లు, కోచ్‌లలోనూ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వీటివల్ల నేరాలకు పాల్పడేవారు కూడా వెనకంజ వేస్తారని, అలాగే నేర పరిశోధన మరింత సులభతరం అవుతుందన్నారు. రైల్వే సిబ్బంది పని తీరుపైనా దృష్టి సారిస్తున్నామని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు, టిటిఇ తదితర సిబ్బంది కచ్చితంగా యూనిఫాం ధరించాల్సిందేనని మంత్రి వివరించారు. ఇరవై రైల్వే స్టేషన్లను యుద్ధ ప్రాతిపదికపై ఆధునీకరిస్తామని ఆయన చెప్పారు. ఎంపిక చేసిన ఈ ఇరవై రైల్వే స్టేషన్లలో అత్యాధునిక వౌలిక సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కలిగిస్తామని గోయల్ ప్రకటించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనిని 2018లోగా ముగిస్తామని ఆయన చెప్పారు. నలభై ఎనిమిది మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మార్చివేస్తామని పీయూష్ గోయల్ ప్రకటించారు. వచ్చే సంవత్సరం నాటికి ఐసిఎఫ్ స్థానంలో ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశ పెడతామన్నారు. మాన్యువల్ ఇంటల్‌లాకింగ్ సిగ్నల్ సిస్టం స్థానంలో ఎలక్ట్రానికి ఇంటర్‌లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. రైల్వే ట్రాక్ లోపాలను కనుగొనేందుకు అల్ట్రాసానిక్ ఫ్రీక్వెన్సీ డిటెక్షన్ వ్యవస్థను, కెమెరాలను ఏర్పాటు చేస్తామని గోయల్ తెలిపారు. ప్రయాణికుల సేవలు, పర్యవేక్షణకు మొబైల్ ఆప్స్ ఉపయోగానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో హైఫ్రీక్వెన్సీ వైఫై కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైళ్ల రాకపోకలను జిపిఎస్ ద్వారా పర్యవేక్షిస్తామని, రైల్వే ఆస్తుల ఉపగ్రహ మ్యాపింగ్ పనిని శీఘ్రగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..ఢిల్లీలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న రైల్వే శాఖ మంత్రి
పీయూష్ గోయల్, సహాయ మంత్రి మనోజ్ సిన్హా