జాతీయ వార్తలు

జెట్ స్పీడ్‌గా.. పోలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 3: పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి మాత్రమే కాదు, దేశానికీ ఎంతో అవసరమని కేంద్ర జలవనరుల మంత్రి నితీన్‌గడ్కరీ పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిచేసే విషయంలో సిఎం చంద్రబాబు ఎంతో కృషిచేస్తున్నారని, అందుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అనుకున్న సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్రాక్ తరహాలో నిర్ణయాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలను మంగళవారం కేంద్ర మంత్రి గడ్కరీ, గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, సిఎం చంద్రబాబు పరిశీలించారు. తొలుత గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో పట్టిసీమకు చేరుకుని డెలీవరి పాయింట్ నుంచి గోదావరి పరవళ్లను తిలకించారు. ఈసందర్భంగా నిర్మాణ విషయాలను సిఎం వారికి వివరించారు. అనంతరం హెలికాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, ఏరియల్ వ్యూ ద్వారా అక్కడి పనులు, స్పిల్‌వే, కాంక్రీట్ పనులు, ప్రాజెక్టుకు అమర్చే గేట్ల తయారీని కేంద్ర మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా సిఎం చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా వ్యూపాయింట్ వద్ద కేంద్ర మంత్రి గడ్కరీ విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ద్వారా గ్రావిటీతో నీరివ్వాలని సిఎం చంద్రబాబు కష్టపడుతున్నారని, ఈ విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని పేర్కొన్న గడ్కరీ 2018 డిసెంబర్ నాటికి గ్రావిటీ ద్వారా జలాలు అందించటం ఒకరకంగా సవాలేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ లక్ష్యాన్ని సాధించడానికి సహకరిస్తామని, 2-3 నెలలు అటూ, ఇటూ అయినా అనుకున్న సమయానికి ప్రాజెక్టు ఫలితాలను జాతికి అందిస్తామన్నారు. దీనికోసం అవసరమైతే వేగవంతంగా నిర్ణయాలు తీసుకునే విధానాన్ని అమలుచేస్తామన్నారు. ప్రాజెక్టు పనులన్నీ పారదర్శకంగా, వేగవంతంగా, అవినీతిరహితంగా కొనసాగేలా చూస్తామన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని, అయితే రానున్న రోజుల్లో దీన్ని మరింత వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించటం వల్ల ఇక్కడున్న ఇబ్బందులు, పనులు జరుగుతున్న తీరు వంటివి అవగాహన చేసుకున్నానని, ప్రస్తుతం మనకు ఇంజనీరింగ్ పరిజ్ఞానం, యంత్రాలు వంటివి పూర్తిస్ధాయిలో అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించి ఈప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేస్తామని గడ్కరీ చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలో నర్మదా డ్యాం తర్వాత ఆ స్థాయిలో జాతికి అంకితంచేసే భారీ ప్రాజెక్టు పోలవరమే అవుతుందన్నారు. 2018 నాటికల్లా గ్రావిటీ ద్వారా పోలవరం జలాలను అందించేలా చూస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. ఈస్థాయి భారీ ప్రాజెక్టు పూర్తికావాలంటే కేంద్రంలో నితిన్‌గడ్కరీ వంటి మంత్రి అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ప్రాజెక్టు పనులను ఇప్పటికీ 21సార్లు ప్రత్యక్షంగా పరిశీలించానని, 40సార్లు వర్చ్యువల్ ఇన్‌స్పెక్షన్ చేశానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టును అనుకున్న గడువులోగా పూర్తి చేయగలుగుతామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని, ఇలాంటి ప్రాజెక్టును అనుకున్న గడువులోగా పూర్తిచేయడానికి కేంద్రమంత్రి గడ్కరీ ఎంతగానో సహకరిస్తున్నారని, ఆయన నాయకత్వంలో ప్రాజెక్టును పూర్తిచేస్తామన్న నమ్మకం తనకుందని చెప్పారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, చీఫ్ ఇంజనీరు వెంకటేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.