జాతీయ వార్తలు

మొరాయంచిన ములాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 5: రెండు రోజుల పాటు సాగే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) జాతీయ కార్యవర్గ సమావేశం, జాతీయ సదస్సుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, అతని సోదరుడు శివపాల్ యాదవ్ గైర్హాజరు అయ్యారు. గురువారం ఇక్కడ ప్రారంభమైన ఈ కార్యక్రమాలకు వారిద్దరు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ముఖ్యంగా ములాయం సింగ్ గైర్హాజరు కావడం పట్ల చర్చించుకున్నారు. మరోవైపు, పార్టీ జాతీయ సదస్సులో అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అఖిలేశ్ యాదవ్ స్వయంగా వెళ్లి పార్టీ జాతీయ సదస్సుకు హాజరు కావలసిందిగా తన తండ్రి ములాయం సింగ్‌ను కోరినప్పటికీ అతను రాకపోవడం గురించి ప్రతినిధులు చర్చించుకోవడం కనిపించింది. అఖిలేశ్ యాదవ్ సహా ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నేతలందరూ ములాయం సింగ్ యాదవ్ రాకపోవడాన్ని ప్రస్తావించారు. ‘సదస్సుకు హాజరు కావలసిందిగా నేను నేతాజీ (ములాయం సింగ్)ని కోరాను. ఆయన వచ్చి ఉంటే ప్రతి ఒక్కరు ఎంతో సంతోషించి ఉండేవారు’ అని అఖిలేశ్ యాదవ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘నేను నిన్న ఆయన (ములాయం)తో మాట్లాడాను. ఈ రోజు కూడా సదస్సుకు రావడానికి ముందు ఆయనతో మాట్లాడాను. ఇదో పెద్ద సదస్సు అని, ఈ సదస్సులో పార్టీ రాజ్యాంగానికి సవరణలు చేయడం జరుగుతుందని, మీ ఆశీస్సులు లేకుండా పార్టీ పురోగమించ జాలదని నేను ఆయనకు చెప్పాను’ అని అఖిలేశ్ వివరించారు. నేతాజీ ఫోన్‌లో మనందరినీ ఆశీర్వదించారని, పార్టీ ఉత్తరప్రదేశ్‌లో, దేశవ్యాప్తంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారని అఖిలేశ్ పేర్కొన్నారు. కుటుంబ తగాదాలలో తనకు రాజకీయ విరోధిగా మారిన తన బాబాయి శివపాల్ యాదవ్ గురించి కూడా అఖిలేశ్ యాదవ్ నిన్న ప్రస్తావించారు. యాదవ్ కుటుంబంలో అంతా సవ్యంగా ఉందనే సంకేతాలను పంపించడానికి అఖిలేశ్ ప్రయత్నించారు. తన బాబాయి శివపాల్ యాదవ్ తనను ఫోన్‌లో ఆశీర్వదించారని, అభినందించారని అఖిలేశ్ బుధవారం పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్ మాట్లాడుతూ 1992లో ములాయం సింగ్ యాదవ్ ఎస్‌పిని స్థాపించిన నాటి పరిస్థితులను నెమరు వేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ములాయం పేరును తాను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. 1992లో జరిగిన సమావేశంలో తాను ఏడ్చానని, అయితే ఇది ఏడవాల్సిన సమయం కాదని, పోరాడటానికి సిద్ధపడాలని నేతాజీ (ములాయం సింగ్) తనకు ఉద్బోధించారని ఆజం ఖాన్ పేర్కొన్నారు. ‘సోషలిస్టులందరికీ నేతాజీ (ములాయం సింగ్) నాయకుడిగా ఉంటారు. నేను ఈ రోజు ఆయనతో మాట్లాడాను. నా ఆశీస్సులు నీకు ఉంటాయని, నీవు కూడా అఖిలేశ్‌ను ఆశీర్వదించు అని ఆయన నాకు చెప్పారు’ అని పార్టీ మరో సీనియర్ నేత కిరణ్మయ్ నందా పేర్కొన్నారు.
పార్టీ జాతీయ సదస్సు వేదికపైనా, ఆగ్రా నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, బ్యానర్లు అన్నింటిపైనా అఖిలేశ్‌తో పాటు ములాయం సింగ్ యాదవ్ చిత్రాలు ఉన్నాయి. అయితే వేటిలోనూ శివపాల్ యాదవ్ చిత్రాలు లేకపోవడం గమనార్హం.

చిత్రం..ఆగ్రాలో గురువారం ప్రారంభమైన ఎస్‌పి జాతీయ కార్యవర్గ సమావేశంలో అభివాదం చేస్తున్న మాజీ సిఎం అఖిలేశ్,
ఆయన సతీమణి, ఎంపి డింపుల్ యాదవ్