జాతీయ వార్తలు

కాంగ్రెస్‌లో ‘కోల్డ్‌వార్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: కాంగ్రెస్ పార్టీలో జూనియర్, సీనియర్ల నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి. అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుకావటంతో జూనియర్, సీనియర్ల మధ్య మాటల యుద్ధం బహిరంగమైంది. కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే యువతకు పెద్దపీట వేయాలంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన జూనియర్ల తిరుగుబాటుకు మరింత ఊతాన్నిచ్చింది. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా నియమించటంతోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సీనియర్లందరినీ ఇంటికి పంపించాలని దిగ్విజయ్ వర్గం వాదిస్తుంటే, సీనియర్లను వదులుకుంటే పార్టీ నిలదొక్కుకోలేదని కొందరు వాదిస్తున్నారు. సోనియా గాంధీని అధ్యక్ష స్థానంలో కొనసాగిస్తూనే రాహుల్ గాంధీకి బాధ్యతలు అప్పగించటంద్వారా జూనియర్లు, సీనియర్లకు మధ్య సమతూకం సాధించాలని మరికొందరు వాదిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుని కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సోనియా ప్రకటించటం తెలిసిందే. అయితే సోనియా ప్రకటన చేసిన మరుసటిరోజే దిగ్విజయ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ ఆత్మపరిశీలన సరిపోదని, పార్టీకి ఏకంగా శస్తచ్రికిత్స చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ ప్రకటన తీవ్ర వివాదాస్పదమయింది. పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి, కమల్‌నాథ్ తదితరులు దిగ్విజయ్ సింగ్ కోరినట్లు పార్టీకి శస్త్ర చికిత్స అవసరమేనని, యువతకు పెద్దపీట వేస్తేనే పార్టీ బాగు పడుతుందని ప్రకటించారు. రాహుల్ గాంధీకి పూర్తి బాధ్యతలు అప్పగించాలని, యువతకు పెద్దపీట వేయాలని, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసిన ఐదు వందల మంది యువ నాయకులను జాతీయ స్థాయినుండి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్థాయి వరకు నియమించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో ఆశించిన లక్ష్యాలను సాధించాలంటే రాహుల్ గాంధీకి ఇప్పటినుండే పూర్తిస్వేచ్చ ఇవ్వాలని పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియర్లు మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. సోనియా గాంధీని పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే కాంగ్రెస్‌ను బతికించుకోవటం అసాధ్యమని రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ అంటున్నారు. ఆమె దూరమైన మరుక్షణం కాంగ్రెస్ ముక్కలవుతుందని ఆయన వాదిస్తున్నారు.
త్వరలో సిడబ్ల్యుసి సమావేశం
ఇటీవల ఎదురైన ఓటమిపై సమీక్ష జరిపి రానున్న రెండేళ్లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవలంబించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో పార్టీలో మార్పుల గురించి ప్రధానంగా చర్చిస్తారని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి.