జాతీయ వార్తలు

ఏం చేద్దామని...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 15: అయోధ్య సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానంటూ మధ్యవర్తిత్వానికి సిద్ధమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ అయోధ్య పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో ముస్లిం వర్గాలనుంచి తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘సమస్య పరిష్కారానికి ఆయన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో ముందు చెప్పమనండి’ అంటూ ముస్లిం వర్గాలు డిమాండ్ చేశాయి. అలాగే, ఈ విషయంలో షియా కేంద్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిం రజ్వీ చేస్తున్న ప్రకటనలనూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న వాదనను తెరపైకి తెచ్చాయి. ‘రవిశంకర్ తన ప్రయత్నంలో భాగంగా ముస్లిం వర్గాలతో మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. కాకపోతే, ఇప్పటివరకు ఏఐఎంపిఎల్‌పి కీలక నేతలను కలిసింది లేదు’ అని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) ప్రధాన కార్యదర్శి వౌలానా వలీ రెహ్మానీ వ్యాఖ్యానించారు. ‘పనె్నండేళ్ల క్రితం రవిశంకర్ ఇలాంటి ప్రయత్నమే చేశారు. చివరకు వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని చెప్పుకొచ్చారు. ఈసారి ఏ కొత్త ఫార్ములాను తెరపైకి తెస్తున్నారో ముందు చెబితే, తరువాత మేమేం చేయాలన్న విషయాన్ని ఆలోచిస్తాం’ అని రెహ్మానీ అన్నారు. వివాదాస్పద స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ఎలా చేపడతారని ప్రశ్నిస్తూనే, వివాదాస్పద స్థలాన్ని ఎదుటి వ్యక్తికో, వర్గానికో ధారాదత్తం చేసే అధికారం ఏ ముస్లిం బోర్డు చైర్మన్‌కూ లేదని తెగేసి చెప్పారు. ‘రజ్వీ లేవనెత్తుతున్న మీర్ బాకి లాజిక్‌నే పరిగణనలోకి తీసకుంటే, బాబ్రీ మసీదును నిర్మించింది షియాల కోసమేనా, ముస్లింల కోసమా? అన్న విషయాన్నీ ఆలోచించాలి’ అని రెహ్మానీ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు బాగోగులు చూసుకుంటున్న నేపథ్యంలో, కేసులో తమనూ ప్రతివాదిగా చేర్చాలంటూ గత ఆగస్టు 8న షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు అధికార ప్రతినిధి వౌలానా యాసూబ్ అబ్బాస్ సుప్రీం కోర్టుకు 30 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, చైర్మన్ రజ్వీ ప్రకటనపై స్పందించటానికి నిరాకరించిన అబ్బాస్, బాబ్రీ విషయంలో తాము ఇప్పటికీ ఏఐఎంపిఎల్‌పితోనే ఉన్నామని అన్నారు. ‘రవిశంకర్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సంబంధించి ఆయన ఏంచేయబోతున్నారో, ఆయన ఆలోచన ఏమిటో ముందు ప్రకటించాలి. ఆ తరువాతే మా కార్యవర్గం దానిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు. బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫ్రయాబ్ జిలాని మాట్లాడుతూ ‘ముస్లిం వర్గాలు వ్యతిరేకించిన అంశాలకు భిన్నమైన అంశంతో రవిశంకర్ చర్చకు వస్తే మాత్రమే, తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ అంశంపై చర్చించే యోచన చేసే అవకాశం ఉంటుంది’ అన్నారు. ఆయన మధ్యవర్తిత్వానికి పరిస్థితులు అనుకూలించి అన్ని వర్గాలు చర్చలకు ముందుకొచ్చినా, విశ్వహిందూ పరిషత్ అంగీకరించే అవకాశం కనిపించటం లేదని వ్యాఖ్యానించారు. విహెచ్‌పి మీడియా ఇన్‌చార్జి శరద్ శర్మ ఈ విషయంలో ఒక ప్రకటన చేస్తూ, ప్రాచీక కట్టడాల ఆధారాల ప్రాతిపదికన చర్చలు మొదలెట్టాలనుకోవడం ఎంతమాత్రం సహేతుకం కాదు, కాకపోతే కోర్టులకు కావాల్సింది అలాంటి ఆధారాలే’ అని పేర్కొన్నారు. ‘కర్నాటకలో ఈ నెల 24-26 మధ్య జరగనున్న 15వ ధర్మన్ సన్సద్‌లో ఈ విషయాన్ని విస్తృతంగా చర్చించాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.
సిఎం యోగితో రవిశంకర్ భేటీ
అయోధ్య పర్యటనకు వెళ్తున్న రవిశంకర్, బుధవారం యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని, ఇద్దరూ పావుగంట పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘అయోధ్య వివాదానికి సంబంధించి, సిఎం యోగి చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రభుత్వం అన్నది ఒక పార్టీ కాదు. దీర్ఘకాల వివాదాన్ని కోర్టు బయట చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఆలోచనకు ప్రభుత్వం దూరంగా లేదు’ అని ఆ అధికారి వెల్లడించారు.