జాతీయ వార్తలు

శీతాకాల భేటీకి గండి కొట్టే కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రజాస్వామ్య దేవాలయానికి తాళాలు వేస్తారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఆయన సారధ్యంలోని ఎన్డీయే సర్కార్‌పైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. సోమవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన సోనియా ‘పసలేని కారణాలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానే్న మోదీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది’అని ధ్వజమెత్తారు. నవంబర్ మూడోవారం నుంచి నెలరోజుల పాటు జరగాల్సిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదించి డిసెంబర్ మధ్యలో పదిరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్న కథనాల నేపథ్యంలో సోనియా మాట్లాడారు. ప్రజలకు సంబంధించిన ఎన్నో అంశాలను చర్చించేందుకు ప్రజాస్వామ్య వేదికగా ఉండే పార్లమెంట్ సమావేశాలను దెబ్బతీయవద్దని మోదీ సర్కార్‌ను కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా ఉన్నంత మాత్రాన ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎంత మాత్రం తప్పించుకోజాలదని హెచ్చరించారు. ఉన్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి, రక్షణ లావాదేవీల్లో మంత్రుల ‘ప్రయోజనాలు’సహా అనేక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. కానీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించకూడదన్న అసాధారణ చర్యను ప్రభుత్వం తీసుకుందని సోనియా విరుచుకు పడ్డారు. సరైన పునాది లేని జిఎస్‌టిని ఆవిష్కరించేందుకు పార్లమెంట్‌ను అర్థరాత్రి సమావేశ పరిచే సాహసాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీకి పార్లమెంట్‌ను
ఎదుర్కొనే ధైర్యమే లేదన్నారు. జిఎస్‌టితో పాటు పెద్ద నోట్ల రద్దు కూడా తప్పుడు నిర్ణయమేనని, దీని వల్ల కోటాను కోట్ల మంది అమాయక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. పేదల బతుకుల్ని ఛిత్రం చేసిన ఈ నిర్ణయాల వాస్తవాలను పట్టించుకోకుండా ప్రధాని మోదీ మరింత ఉత్తేజంగా ప్రకటనలు గుప్పిస్తున్నారని, హామీలు ఇస్తున్నారని సోనియా అన్నారు. ఆయన చెప్పే మాటలకు వాస్తవాలకు ఏకోశానా పొంతనే లేదని తెలిపారు. నెహ్రూ, గాంధీలు చేసిన సేవల్ని ఓ వ్యూహం ప్రకారం విస్మరించడం ద్వారా ఆధునిక భారత చరిత్రనే మోదీ సర్కార్ బలవంతంగా తిరగరాస్తోందన్నారు. ఇందిరా గాంధీ శత జయంతినే విస్మరించడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజల్ని మోసం చేయడం ఎవరి తరం కాదన్న విషయాన్ని రుజువు చేయాలని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని పార్టీ నేతలు, శ్రేణులకు సోనియా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.