జాతీయ వార్తలు

లక్నోలో స్థలమిస్తే.. అయోధ్యపై హక్కులకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 20: దశాబ్దాలుగా సాగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారం విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని షియా వక్ఫ్ బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై తమ హక్కులను వదలుకుంటామని, దానికి బదులుగా లక్నోలో ఓ మసీదును నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఇతర ముస్లిం నేతలు తిరస్కరించారు. బాబ్రీ మసీదు సంరక్షణ బాధ్యతను షియా వక్ఫ్‌బోర్డే నిర్వహిస్తుందని, సమస్య పరిష్కారంలో భాగంగా అయోధ్య స్థలాన్ని వదలుకోవాలని ప్రతిపాదించామని, ఇందుకు సంబంధించి తాము రూపొందించిన ఓ ప్రతిపాదనను నవంబర్ 18న సుప్రీం కోర్టుకు నివేదించామని బోర్డు చైర్మన్ వాసిం రిజ్వీ వెల్లడించారు. అయోధ్య సమస్య పరిష్కారానికి ఇంతకుమించి ఉత్తమ మార్గం లేదని పేర్కొన్న రిజ్వీ, అయోధ్యకు బదులుగా లక్నోలోని హుస్సైనాబాద్ ప్రాంతంలో మసీద్-ఏ- అమన్ (శాంతి మసీదు)ను నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎకరం స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ ప్రతిపాదనను అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరించింది. ఎవరి తరఫున రిజ్వీ ఈ ప్రతిపాదన చేశారని ప్రశ్నించింది. ఇటు సున్నీలోగానీ, అటు షియాల్లోగానీ రిజ్వీ నాయకత్వం పట్ల ఎలాంటి విశ్వాసం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు న్యాయవాది, సీనియర్ సభ్యుడు జఫరియాబ్ జిలానీ స్పష్టం చేశారు. షియా బోర్డు ప్రతిపాదించిన ముసాయిదాలో చట్టానికి సంబంధించిన ఎన్నో లోపాలు ఉన్నాయని తెలిపారు. అయోధ్య స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని, అలహాబాద్ హైకోర్టు రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ తాజా ప్రతిపాదన చేసే అధికారం షియా బోర్డుకు ఎంతమాత్రం లేదన్నారు. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌లీల సంస్థలకు 2.77 ఎకరాల చొప్పున అయోధ్య స్థలాన్ని అప్పగించాలని అలహాబాద్ హైకోర్టు రూలింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ‘ఈ స్థలంలో ఏ భాగంపైనా షియా బోర్డుకు హక్కులేదు’ అని తేల్చిచెప్పారు.