జాతీయ వార్తలు

33వేల కోట్లు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ పథకం జీవచ్ఛవంలా మారిపోయింది.. గుజరాత్‌లో టాటా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నానో’ కార్ల ప్రాజెక్టుకోసం మోదీ ప్రభుత్వం ఇచ్చిన 33వేల కోట్ల రూపాయల రాయితీ కాస్తా బూడిదలో పోసిన పన్నీరు చందంలా వృథా అయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. అహ్మదాబాద్‌లోని సనంద్‌లో టాటా కంపెనీ ఏర్పాటు చేసిన నానో కార్ల ప్రాజెక్టుకోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం దాదాపు 33వేల కోట్ల రూపాయల మేరకు పన్ను రాయితీలు కల్పించింది. ఇది యుపిఏ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి ఖర్చుచేసిన మొత్తానికి సమానమని రాహుల్ వివరించారు. ఇంత పెద్దమొత్తంలో రాయితీ పొందిన ఆ కంపెనీల వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఏమీ లేవని, టాటా నానోకారు మీరు డ్రైవ్ చేశారా? మీ ఇంట్లో నానో కారు ఉందా? ఆ కంపెనీలో మీ పిల్లలు ఎవరన్నా ఉద్యోగాలు పొందారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
సామాన్యుడి కారు పేరుతో ‘నానో’ కార్లను తయారు చేయడం మొదలుపెట్టిన టాటా కంపెనీ ఆ మోడల్‌కు వినియోగదారుల నుంచి సరిగ్గా స్పందన రాకపోవడంతో ఎత్తివేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. దీనిని ఆసరా చేసుకుని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోశారు. ‘నేను చెప్పినట్లుగానే మోదీ ‘సూట్ బూట్ సర్కార్’ అని, సామాన్య ప్రజానీకానికి ఎలాంటి మేలు చేయడం లేదని విమర్శించారు. 2014 ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిని రోల్‌మోడల్‌గా చూపించి ఓట్లు దండుకున్నారని, ఇప్పుడు అక్కడి పథకాలు సైతం విఫలమవుతున్నాయని, ఆ పథకాలు దేశం మొత్తానికి పనికిరావన్న సంగతి గుర్తించాలని రాహుల్ అన్నారు. అక్కడి పథకాలన్నీ పారిశ్రామికవేత్తలకే ఉపకరించాయని, రైతులు, జాలర్లు, కార్మికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం జీఎస్‌టీ కూడా అమలులో విఫలమైందని పన్ను విధానంతోపాటు రిటర్న్స్ ఫైల్ చేయడం చిన్న వ్యాపారులకు తలకు మించిన భారంగా మారిందని అన్నారు.

చిత్రం..గుజరాత్‌లోని దాహోడ్‌లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో విల్లు ఎక్కుపెట్టిన రాహుల్ గాంధీ