జాతీయ వార్తలు

కేదార్‌నాథ్‌కు పునర్‌వైభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, నవంబర్ 27: ఓ వైపు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరోవైపు సుమారు 200 మంది కూలీలు కేదార్‌పురి పునర్నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రముఖ హిందూ ఆథ్యాత్మిక క్షేత్రమైన కేదారినాథ్‌లో 2013లో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడడంతో అనేక భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రకృతి బీభత్సం ఫలితంగా కేదారినాథ్ ప్రాంతం కళావిహీనమైంది. హిమాలయ పర్వత పంక్తుల్లోని కేదారిపురిని పునర్నిర్మించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇక్కడ చేపట్టిన తొలిదశ పునర్నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మంగేశ్ ఘిల్‌దియాల్ చెబుతున్నారు. సముద్ర మట్టానికి సుమారు 12వేల అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ ఆలయం ఉంది. ‘చార్‌థామ్’ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌కు ప్రతిరోజూ సుమారు 5,000 మంది యాత్రికులు వస్తుంటారు. ఏటా మే నుంచి అక్టోబర్ వరకూ ఈ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంటుంది. నాలుగేళ్ల క్రితం ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడడంతో కేదార్‌నాథ్ ఆలయం, పరిసర ప్రాంతాల్లోని కట్టడాలు దాదాపు తుడిచి పెట్టుకుపోయాయి. వందలాది భవనాలు ధ్వంసం కావడంతో అప్పట్లో దాదాపు 5వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కేదార్‌నాథ్ క్షేత్రాన్ని పునర్నిర్మించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్రంలో, కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే గత నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ప్రస్తుత శీతాకాలంలో ఆలయాన్ని మూసివేయడానికి ఒక్కరోజు ముందు ప్రధాని కేదార్‌నాథ్‌లో పర్యటించడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ పర్యటన సందర్భంగా సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే అయిదు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ‘కేదార్‌పురి పునర్నిర్మాణ పథకం’ కింద ఈ అయిదు ప్రాజెక్టులను చేపడతారు. తన పర్యటన సందర్భంగా ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనుల తీరుతెన్నులను ఆయన సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పనులపై తాను ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటానని ప్రధాని ప్రకటించారు.
కేదార్‌పురి తొలిదశ పనులు యుద్ధ ప్రాతిపదికపై జరుగుతున్నాయని, గడ్డకట్టే చలిలో రాత్రివేళ కూడా కూలీలు పని చేస్తున్నారని రుద్రప్రయాగ జిల్లా కలెక్టర్ మంగేశ్ వివరించారు. వాతావరణం అనుకూలంగా ఉంటే పనులు మరింత వేగంగా జరుగుతాయన్నారు. నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కూలీలు, ఇతర సిబ్బంది చలిని తట్టుకుని పనిచేసేలా గ్లోవ్స్, బూట్లు, జాకెట్లు ఇతర సౌకర్యాలను అందజేస్తున్నామన్నారు. తొలి దశ పనులకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామన్నారు. సంగం నుంచి కేదారినాథ్ ఆలయం వరకూ 50 మీటర్ల వెడల్పుతో రహదారిని నిర్మిస్తామని, సరస్వతి, మందాకిని నదుల వెంబడి రక్షిత గోడలను నిర్మిస్తామని ఆయన తెలిపారు. 2013లో ధ్వంసమైన ఆదిగురు శంకరాచార్య సమాధిని పునర్నిర్మిస్తామన్నారు. ‘చార్‌థామ్’ యాత్ర ప్రారంభం నాటికి (వచ్చే ఏడాది మే నాటికి) రక్షణ గోడలు, రహదారుల నిర్మాణం, ఆలయ పునర్నిర్మాణం పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినపుడు పనులన్నీ సజావుగా జరిగే అవకాశం ఉందన్నారు.