జాతీయ వార్తలు

చాయ్ అమ్మాను.. దేశాన్ని కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 27: గుజరాత్ బిడ్డనైన తనను అవమానపరిస్తే తన రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ప్రాంతాల్ల జరిగిన బీజేపీ ర్యాలీలలో ఆయన మాట్లాడుతూ, తన పేదరికాన్ని ఎగతాళి చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు. తనను కించపరిస్తే యావత్ గుజరాత్ ప్రజలను అవహేళన చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితంలో తనపై ఒక్క మచ్చ కూడా లేదన్నారు. ‘చాయ్‌వాలా’ అంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ‘అవును.. నేను చాయ్ అమ్మాను.. కానీ మీలా దేశాన్ని అమ్మలేదు..’ అని ఆవేశంగా అన్నారు. ‘గుజరాత్‌లోకి అడుగుపెట్టి, ఆ రాష్ట్రం బిడ్డనైన నన్ను ఎగతాళి చేస్తున్నారు.. ఏ ఒక్క గుజరాతీ కూడా దీన్ని సహించడు.. గుజరాత్ నా మాతృమూర్తి.. నేను ఆమె కుమారుడిని..’ అని ఆయన అన్నారు. ‘గుజరాత్ ప్రజలే నన్ను తీర్చిదిద్ది ఇంతటి వాడిని చేశారు.. నాకు బలాన్ని ఇచ్చి, మంచిని నేర్పారు..’ అని మోదీ భావోద్వేగంతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ నన్ను ఇష్టపడదు.. అందుకే వారు నా పేదరికం గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు.. దయచేసి నా పేదరికం మూలాలపై మాట్లాడవద్దు’ అని ఆయన కోరారు. కాగా, ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమవారం నాడు కచ్ ప్రాంతంలో మోదీ పర్యటించారు. స్థానికుల ఆరాధ్య దైవమైన మా ఆశాపుర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద మహిళలు, పిల్లలను ఆయన కలుసుకున్నారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా మోదీ తొలి పర్యటన సోమవారం జరిగింది. ఎన్నికల ప్రకటన వెలువడక ముందు ఆయన ప్రధాని హోదాలో అధికారిక పర్యటనలు జరిపి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. మాతా నొ మధ్ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ ప్రాంతంలో మోదీ పర్యటించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. భుజ్‌లో పర్యటించినపుడు ఆయన కచీ భాషలో ప్రసంగించి స్థానికులను ఆకట్టుకున్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్‌పైనా మోదీ విమర్శలు సంధించారు. డోక్లామ్‌లో యుద్ధవాతావరణం నెలకొన్నపుడు రాహుల్ చైనా రాయబారిని కలవడంలో అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. సర్దార్ పటేల్ జన్మించిన రాష్ట్రం నుంచి తాను మాట్లాడుతున్నానని, ఈ దేశాన్ని దోచుకున్న కాంగ్రెస్ వారికి ప్రజలు మరో అవకాశం ఇవ్వరని ఆయన అన్నారు. గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాల్లో తమ పార్టీ కనీసం 151 స్థానాల్లో గెలుపు సాధిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం..సూరత్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ