జాతీయ వార్తలు

ఆ రాష్ట్రాలది కుంభకర్ణ నిద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు కుంభకర్ణుడిలా నిద్ర పోతున్నాయని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగాన్ని నిషేధిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుపట్టడాన్ని న్యాయస్థానం వ్యతిరేకించింది. జస్టిస్ మదన్ బీ లోకుర్, దీపక్ గుప్తాల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందన్న అభిప్రాయాన్ని ఆ మూడు రాష్ట్రాలూ కలిగిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఈ విషయంలో ఉత్తర్వులను కోర్టు ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉంటే వాటిని మేల్కొలపడం తమ విధి’ అంటూ న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను కోర్టు పరిశీలించింది. పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎఎన్‌ఎస్ నద్‌కర్ణి ధర్మాసనం ముందు మాట్లాడుతూ, ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగంపై తాము ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదని, ఆ మూడు రాష్ట్రాలు మాత్రం ఈ విషయమై తమకు విన్నవించాయని తెలిపారు. దీంతో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ, ‘ నోటీసు లేకుండానే మేం ఉత్తర్వులు ఇచ్చామని ఎలా అంటారు? ఆరోపణలు చేయడమే గాక ఆ మూడు రాష్ట్రాలూ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాయ’ని అన్నారు. రాజస్థాన్ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో హాజరై, తాను ఈ విషయమై దృష్టి సారిస్తానని, కోర్టుపై ఆరోపణలు చేసే పరిస్థితి ఉండదని హామీ ఇచ్చారు. తాము అఫిటవిట్లు దాఖలు చేస్తామని యుపీ, హర్యానా తరఫున హాజరైన న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా అఫిటవిట్లను దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నవంబర్ 1 నుంచి యుపి, హర్యానా, రాజస్థాన్‌లలో ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగాన్ని నిషేధిస్తూ గత అక్టోబర్ 24న కోర్టు ఆదేశాలను జారీ చేసింది. యుపి, హర్యానా, రాజస్థాన్‌లలో ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగాన్ని నిషేధించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు గతంలోనే మార్గదర్శకాలను జారీ చేసిందని కోర్టుకు కేంద్రం తెలిపింది. వీటి వినియోగాన్ని ఢిల్లీలో ఇప్పటికే నిషేధించారు. ఇంధన బొగ్గు, ఫర్నెస్ ఆయిల్ వినియోగం వల్ల వాయువు విషపూరితం అవుతోందని, పర్యావరణంలో గంధక శాతం పెరిగిపోతోందని కోర్టు పేర్కొంది.