జాతీయ వార్తలు

మీకే కాదు.. నాకూ బాసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మొత్తం పార్టీ శ్రేణులకే కాకుండా తనకు కూడా బాసేనని సోనియా గాంధీ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని, ఇందుకోసం భావ సారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సోనియా తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీపైనా, ప్రధాన మంత్రి మోదీపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సోనియా గాంధీ ‘తన సంకుచిత రాజకీయ ప్రయోజనాలను సాధించుకునేందుకు మోదీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాకాండ సృష్టిస్తోంది’ అని అన్నారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో కూడా ఈ రకమైన రాజకీయ కుట్రపూరిత వ్యూహాన్ని అమలుచేసేందుకే బీజేపీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ అయిన సోనియా గాంధీ అన్నారు. పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం గురించి ఉద్ఘాటించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా నిలిస్తూ విధేయత, అంకితభావంతో ఎంపీలు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ‘రాహుల్ గాంధీ మీ అందరికే కాదు.. నాక్కూడా బాసే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు.. రాహుల్‌కు అన్ని విధాలుగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సోనియా అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున, తన తరఫున రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయంగా అంకితభావంతో పనిచేయడం
అన్నది పార్టీకి పూర్వవైభవం తేవడానికి అత్యంత కీలకమని అన్నారు. తాను పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అదే స్ఫూర్తిని కనబర్చి రాహుల్ నాయకత్వంలోనూ పనిచేయాలని సోనియా పిలుపునిచ్చారు. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా రాహుల్ నాయకత్వంలో పార్టీ కచ్చితంగా విజయాలను సాధించగలదన్న నమ్మకం తనకుందని సోనియా అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పునరుజ్జీవన ప్రక్రియ మొదలైందని పేర్కొన్న సోనియా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వాస్తవాలు పట్టవని ధ్వజమెత్తారు. లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, అలాగే దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక భావనల పునరుద్ధరణే ధ్యేయంగా అన్ని పార్టీలూ కలిసి పనిచేయాలన్నారు. మోదీ హయాంలో మైనారిటీలకు భద్రత లేదని, దళితులపై తీవ్రస్థాయిలో దాడులు పెచ్చరిల్లుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ దాడులు ఒక పథకం ప్రకారం సమాజాన్ని చీల్చాలన్న ఉద్దేశంతో జరుగుతున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాతాలు ఉన్నాయని తెలిపారు. ఈ రకమైన పరిస్థితే గతంలో ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో తలెత్తిందని రానున్న ఎన్నికల సమయంలో కూడా కర్నాటకలోనూ ఇలాంటి పరిస్థితులే పునరావృతం అయ్యే అవకాశం ఉందని సోనియా తెలిపారు. సంకుచిత ప్రయోజనాలకోసం సమాజాన్ని చీల్చడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరపూరిత చర్య అని పేర్కొన్న సోనియా, ఇంత జరుగుతున్నా కేంద్రంలోని అధికార పార్టీ నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం విడ్డూరమన్నారు.