జాతీయ వార్తలు

రక్షణ రంగంలో కృత్రిమ మేథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టే ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. సైనిక దళాల సంసిద్ధతా స్థాయిని పెంచేందుకు వీలుగా మానవ రహిత ట్యాంకులను, నౌకలను, రొబొటిక్ ఆయుధాలను ప్రవేశపెట్టనున్నది. ఒకవైపు చైనా తన సైన్యానికి సంక్లిష్టమైన కృత్రిమ మేధస్సుతో కూడిన అప్లికేషన్లను అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అందుకు దీటుగా పదాతి దళం, నేవీ, వైమానికదళాల్లో కృత్రిమ మేధస్సును చొప్పించడం ద్వారా రాబోయే తరం యుద్ధాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న విస్తృత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ మేరకు రక్షణ ఉత్పత్తుల కార్యదర్శి అజయ్ కుమార్ మాట్లాడుతూ, టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ఫ్రేమ్‌వర్క్‌కు తుదిరూపం ఇస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును సైనిక దళాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్య నమూనాలో చేపడతారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాలు పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో, స్వయంచాలిత, రోబోలను ఉపయోగించే దశకు చేరుకుంటాయని, దీనికి అనుగుణంగా మనం సంసిద్ధులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు. అందుకోసం ఈ వేదికలపై మన సామర్ధ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. తద్వారా ఈ రంగంలో అభివృద్ధి సాధించిన అనేక దేశాల సరసన మనం కూడా చేరవచ్చునన్నారు.
ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా, పెట్రోలింగ్ కార్యకలాపాల్లో కృత్రిమ మేధోపకరణాలను ఉపయోగించడం ద్వారా, సంప్రదాయ సైనిక దళాలపై ఒత్తిడి తగ్గించవచ్చు. ప్రస్తుతం చైనా కృత్రిమ మోధస్సు (ఎఐ)పై జరిపే పరిశోధనల కోసం బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేస్తోంది. 2030 నాటికి దేశాన్ని ఆర్ట్ఫిసియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఇన్నోవేషన్ కేంద్రంగా రూపొందించాలన్న లక్ష్యాన్ని చైనా ఇప్పటికే ప్రకటించింది. ఇక యుఎస్, బ్రిటన్, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ దేశాలుకూడా కృత్రిమ మేధో యంత్రాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వాయువ్య ప్రాంతాల్లోని ఉగ్రవాదులపై అమెరికా డ్రోన్ దాడులను విజయవంతంగా నిర్వహిస్తోంది. వందలాది మంది ఉగ్రవాదులు డ్రోన్ల దాడిలో ఇప్పటికే మరణించారు.
ఇదిలావుండగా కుమార్ మాట్లాడుతూ, కృత్రిమ మేధపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ వచ్చే జూన్ నెలాఖరు నాటికి నివేదిక సమర్పిస్తుంది. తక్షణమే ప్రభుత్వం కార్యాచరణలో దిగుతుందన్నారు. దేశంలో ఐటీ పరిశ్రమ బలీయంగా ఉండటం సానుకూలాంశం. దీని ద్వారా కృత్రిమ మేధో సామర్ధ్యాలను మరింతగా పెంచుకోవచ్చునన్నారు. ఈ ప్రాజెక్టును మరింత ముందుక తీసుకెళ్లడంలో కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్రేమ్‌వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలు, రక్షణ దళాలు సంయుక్తంగా, రక్షణ వ్యవస్థకు ఆర్ట్ఫిసియల్ ఇంటెలిజెన్స్ పరంగా గట్టి పునాదిని ఏర్పరుస్తాయని కుమార్ వెల్లడించారు.
ఈ రంగంలో భాగస్వామ్య నమూనాలో ముందుకు వెళ్లాలి తప్ప, అమ్మకం దారు-కొనుగోలు దారు అనే విధానంలో కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని డీఆర్‌డీఓ ఈ ప్రాజెక్టు విషయంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌర రంగంలో కూడా కృత్రిమ మేధ ఉపయోగం విస్తృతంగా ఉన్నదని, ఇప్పటికే దీనిపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ తన పనిని కొనసాగిస్తున్నదన్నారు.